
కర్నూలు: గీతా జయంతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ), హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు నిర్వహించనున్నట్లు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి తెలిపారు.
నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నంద్యాల జిల్లాలో డిసెంబర్ 12వ తేదీ ఉదయం 10 గంటలకు నంద్యాల పట్టణంలోని శ్రీ శారదా విద్యాపీఠంలో, కర్నూలు జిల్లాలో డిసెంబర్ 14వ తేదీ ఉదయం 10 గంటలకు సీక్యాంప్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి విభాగంలో ప్రథమ బహుమతిగా రూ.1,116, ద్వితీయ బహుమతిగా రూ.816, తృతీయ బహుమతిగా రూ.516 అందించనున్నట్లు వివరించారు.
భగవద్గీతపై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం 9441008677, 9059802265 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
భగవద్గీత జ్ఞానాన్ని భావితరాలకు అందించడంతో పాటు యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం.




