
సనాతన ధర్మం ప్రకృతిని దైవస్వరూపంగా భావించి ఆరాధించే గొప్ప జీవన విధానాన్ని మనకు అందించింది. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాలను పవిత్రమైనవిగా భావించడం మన సంస్కృతిలో అంతర్భాగం. ప్రకృతిని కాపాడుకోవడం అంటే మన జీవితాన్ని, భవిష్యత్తు తరాల ఉనికిని కాపాడుకోవడమేనని సనాతన ధర్మం బోధిస్తోంది.
ప్రకృతిలోనే దైవత్వాన్ని దర్శించే సంస్కృతి
మన సంప్రదాయంలో నదులను తల్లులుగా, భూమిని భూదేవిగా, గోవును గోమాతగా, వృక్షాలను పవిత్రమైనవిగా భావిస్తాం. తులసి, రావి, వేప వంటి వృక్షాలను పూజించడం వెనుక ప్రకృతి పరిరక్షణ భావన కూడా ఉంది. నదులు, చెరువులు, అడవులు, పర్వతాలను కాపాడుకోవడం మన ధార్మిక బాధ్యతగా భావించాలి.
పర్యావరణ పరిరక్షణే ధర్మాచరణ
నేటి కాలంలో కాలుష్యం, అడవుల నరికివేత, నీటి వృథా, ప్లాస్టిక్ వినియోగం వంటి సమస్యలు ప్రకృతికి ముప్పుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సనాతన ధర్మం బోధించిన ప్రకృతి ప్రేమను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలి.
– ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి.
– నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలి.
– ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి.
– చెరువులు, నదులు, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.
– గోసంరక్షణ, జీవజాల పరిరక్షణకు కృషి చేయాలి.
– పండుగలు, ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించాలి.
భావితరాలకు ప్రకృతి సంపదను అందిద్దాం
పిల్లలకు చిన్నతనం నుంచే ప్రకృతి పట్ల ప్రేమ, చెట్ల ప్రాధాన్యత, నీటి విలువ, జంతువుల పట్ల దయ వంటి అంశాలను నేర్పించాలి. ఆలయాలు, ధార్మిక సంస్థలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. ప్రతి పండుగను ప్రకృతికి హాని కలగకుండా జరుపుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి.
సనాతన ధర్మం మనిషి ప్రకృతికి యజమాని కాదని, ప్రకృతిలో ఒక భాగమని తెలియజేస్తుంది. ప్రకృతిని పూజించడం ఎంత ముఖ్యమో, దానిని పరిరక్షించడం కూడా అంతే ముఖ్యం.ప్రకృతిని కాపాడటం పరమ ధర్మం.. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత.మన సంప్రదాయాలను ఆచరిస్తూ, ప్రకృతిని గౌరవిస్తూ, పర్యావరణహిత జీవనశైలిని అలవర్చుకుందాం. స్వచ్ఛమైన ప్రకృతిని, పచ్చని భూమిని భావితరాలకు వారసత్వంగా అందిద్దాం.
ధర్మాన్ని ఆచరిద్దాం – ప్రకృతిని రక్షిద్దాం – సనాతన సంస్కృతిని భావితరాలకు అందిద్దాం!




