
చెన్నై: తమిళనాడుకు ప్రత్యేక రాష్ట్ర జెండా ఉండాలని, దానికి భారత జాతీయ పతాకంతో సమానమైన హోదా కల్పించాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ మంత్రి అధవ్ అర్జున డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తొలిసారిగా ఈ జెండాను ఆవిష్కరించాలని, రాష్ట్రంలోని ప్రతి ఇంటిపైనా ఎగురవేయాలని సూచించారు. ఆయన వ్యాఖ్యలతో తమిళనాడుకు ప్రత్యేక జెండా ఉండాలన్న అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది.
తమిళనాడుకు సొంతంగా జెండా ఉండాల్సిన అవసరం ఉందని అధవ్ అర్జున పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలకు ప్రత్యేక జెండాలు ఉన్నాయని, తమిళనాడుకు కూడా అలాంటి గుర్తింపు ఉండాలని అభిప్రాయపడ్డారు. తమిళ భాష, సంస్కృతి, రాష్ట్ర ప్రత్యేకతను ప్రతిబింబించేలా జెండా రూపొందించాలని కోరారు. జూలై 18న నిర్వహించే తమిళనాడు దినోత్సవం, నవంబరు 1న జరుపుకునే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ దినోత్సవం సందర్భంగా ఈ జెండాను ఎగురవేయాలని ముఖ్యమంత్రికి సూచించారు.
ప్రత్యేక రాష్ట్ర జెండా ప్రతిపాదన తమిళనాడుకు కొత్తదేమీ కాదు. 1970లో అప్పటి ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కూడా రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉండాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా టీవీకే మంత్రి చేసిన వ్యాఖ్యలతో దాదాపు ఐదు దశాబ్దాల నాటి ప్రతిపాదన మళ్లీ చర్చకు వచ్చింది.
మరోవైపు, రాష్ట్రాలకు ప్రత్యేక జెండాల అంశంపై 2018లో కేంద్ర హోంశాఖ పార్లమెంటులో వివరణ ఇచ్చింది. భారత రాజ్యాంగంలో రాష్ట్రాలకు ప్రత్యేక జెండా ఉండాలని గానీ, ఉండకూడదని గానీ నిర్దిష్ట ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. జాతీయ పతాక గౌరవం, దాని ప్రదర్శనకు సంబంధించిన నిబంధనలు మాత్రం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ద్వారా అమలవుతున్నాయి.
అధవ్ అర్జున వ్యాఖ్యలపై బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళ భాషకు, సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి మరో జెండా అవసరం లేదని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. భారత త్రివర్ణ పతాకం కింద తమిళుల భాష, సంస్కృతి, గుర్తింపు ఏమాత్రం తగ్గిపోవని వ్యాఖ్యానించారు. తమిళ, భారతీయ గుర్తింపులను పరస్పర విరుద్ధమైనవిగా చూపిస్తూ ప్రజల మధ్య విభజన సృష్టించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
మంత్రి ప్రతిపాదన, బీజేపీ అభ్యంతరంతో తమిళనాడులో ప్రత్యేక జెండా అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ప్రత్యేక జెండా రూపకల్పన, అధికారిక గుర్తింపు విషయంలో ఎలాంటి చర్యలు చేపడుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.





