News

గోవు కేవలం జంతువు కాదు.. సమాజానికి, ధర్మానికి మూలస్తంభమని గుజరాత్ కోర్టు వ్యాఖ్య

6views

(గుజరాత్): గోమాతను అత్యంత క్రూరంగా వధించి, మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన కేసులో ముగ్గురు నిందితులకు గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా కలోల్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గోవులను ఇంతటి క్రూరంగా హతమార్చే వారిని చట్టప్రకారం శిక్షించకపోతే భవిష్యత్తులో భూమిపై నుంచి గోమాత అంతరించిపోయే ప్రమాదం ఉందని కోర్టు వ్యాఖ్యానించడం ఈ తీర్పులో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

వసీం ఖురేషీ, మహమ్మద్ రఫీక్ ఖురేషీ, అష్ఫాక్ బెహ్లిమ్ అనే ముగ్గురిని దోషులుగా నిర్ధారించిన అదనపు సెషన్స్ న్యాయమూర్తి బి.ఆర్. రాజ్‌పుత్ వారికి జీవిత ఖైదు విధించారు. ఒక్కొక్కరికి రూ.2 లక్షల జరిమానాతో పాటు, గుజరాత్ పశు సంరక్షణ చట్టంలోని మరో నేరానికి సంబంధించి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, అదనంగా రూ.లక్ష జరిమానా విధించారు. రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయి. అంటే ఒక్కొక్కరికి మొత్తం రూ.3 లక్షల జరిమానా విధించారు.

వేదాలు, మనుస్మృతిని ప్రస్తావించిన న్యాయస్థానం
76 పేజీల గుజరాతీ తీర్పులో న్యాయమూర్తి హిందూ ధర్మగ్రంథాలైన వేదాలు, మనుస్మృతిని ప్రస్తావిస్తూ గోవుకు భారతీయ సంస్కృతిలో ఉన్న విశిష్ట స్థానాన్ని వివరించారు. హిందూ సంప్రదాయంలో గోవును మాతృస్వరూపంగా పూజిస్తారని, సమాజానికి, ధర్మానికి గోవు ఎంతో ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఋగ్వేదంలో గోవును ‘అఘ్న్యా’ (వధించకూడనిది)గా అభివర్ణించిన విషయాన్ని ప్రస్తావించారు.

తీర్పులో గోవు పవిత్రతను తెలియజేసే సంస్కృత శ్లోకాన్ని కూడా ఉటంకించారు.

“త్వం మాతా సర్వదేవానాం త్వం చ యజ్ఞస్య కారణమ్” అంటే.. నీవు సమస్త దేవతలకు తల్లివి. యజ్ఞయాగాదులకు మూలకారణానివి. పవిత్ర తీర్థక్షేత్రాలన్నింటిలోనూ అత్యంత పవిత్రమైనదానివి అని ఈ శ్లోకం భావం అని గోవులను రక్షించడం, పోషించడం సమాజ బాధ్యత అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

2 గోమాంసం స్వాధీనం
ఈ కేసు 2024 ఆగస్టు 22న వెలుగులోకి వచ్చింది. గాంధీనగర్ జిల్లాలోని కలోల్ తాలూకా జమ్లా గ్రామంలో ఓ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ గోవులను వధించి మాంసాన్ని విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు గుర్తించారు.

ఈ దాడుల్లో సుమారు 277 కిలోల గోమాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.55,400గా అంచనా వేశారు. కత్తులు, గొడ్డలి, త్రాసులు, తాళ్లు, మాంసం తరలించేందుకు ఉపయోగించిన వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో మొత్తం ఆరుగురిపై విచారణ జరగగా, వారిలో ముగ్గురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. మరో ఇద్దరిపై నేరం నిరూపితం కాకపోవడంతో నిర్దోషులుగా విడుదల చేసింది. ఒక నిందితుడు విచారణ సమయంలో మరణించాడు.