ArticlesNews

స్ట్రాబెర్రీ సాగుతో ఐరాస గుర్తింపు.. రైతుగా రికార్డులు సృష్టించిన మిజోరం మహిళ

33views

జీవితంలో ప్రత్యేకంగా నిలవాలంటే భిన్నంగా ఆలోచించాలి. అవకాశాల కోసం ఎదురుచూడకుండా మనకు అందుబాటులో ఉన్న వనరులతోనే కొత్త మార్గాలను అన్వేషించాలి. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్మారు మిజోరానికి చెందిన 35 ఏళ్ల జెడ్‌టీ లాల్‌రిథాంగి. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే వ్యవసాయంపై ఆసక్తిని పెంచుకున్నారు. సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా స్ట్రాబెర్రీ సాగును చేపట్టి విజయాన్ని అందుకున్నారు. పండ్ల సాగుతోనే ఆగకుండా వాటితో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తూ ఆదాయాన్ని పెంచుకున్నారు. ఆమె వినూత్న ఆలోచనలు, కృషికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని సంస్థ నుంచి ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఓ మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు సాగిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

రైతు కుటుంబంలో పుట్టి.. వ్యవసాయంపై మక్కువతో!
మిజోరం రాష్ట్రంలోని లాంగ్‌ట్లాయ్‌ జిల్లాలోని మారుమూల గ్రామం సాంగావ్‌ లాల్‌రిథాంగి స్వస్థలం. రైతు కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నతనం నుంచే వ్యవసాయంతో అనుబంధం ఏర్పడింది. తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తూ సాగులోని మెళకువలను తెలుసుకున్నారు. ఉన్నత విద్యపై ఆసక్తితో సోషియాలజీలో పీజీ పూర్తి చేశారు. అనంతరం పలు పోటీ పరీక్షలు రాసినా ఆశించిన ఫలితం దక్కలేదు. చివరకు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూనే తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయాన్ని మాత్రం వదులుకోలేదు. ఏదో ఒక రంగంలో ప్రత్యేకత సాధించాలన్న తపన ఆమెను కొత్త ఆలోచనల వైపు నడిపించింది.

స్ట్రాబెర్రీ సాగుతో కొత్త ప్రయోగం
2024లో తమ ప్రాంతంలో చాలామంది స్ట్రాబెర్రీ సాగు చేయడాన్ని గమనించిన లాల్‌రిథాంగి.. ఆ పంటలో ఉన్న అవకాశాలను గుర్తించారు. వెంటనే పుస్తకాల్లోని సమాచారానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించారు. సాగు విధానాలు, మొక్కల పెంపకం, పంట యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంచుకున్నారు. ఆ తర్వాత సుమారు వెయ్యి స్ట్రాబెర్రీ మొక్కలతో ప్రయోగాత్మకంగా సాగు ప్రారంభించారు.

తొలి ప్రయత్నంలోనే ఆమెకు మంచి ఫలితాలు వచ్చాయి. భిన్నమైన సాగు పద్ధతులను అనుసరించడంతో మొదటి ఏడాదే సుమారు రూ.1.50 లక్షల ఆదాయం పొందారు. ఈ విజయం ఆమెలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. దీంతో సాగు విస్తీర్ణాన్ని రెండు హెక్టార్లకు పెంచారు. 2025లో ఏకంగా రూ.10 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించారు.

పంట నుంచి ఉత్పత్తుల తయారీ వరకు..
చాలామంది రైతులు పంట పండించడం, మార్కెట్‌లో విక్రయించడంతోనే తమ బాధ్యత పూర్తయిందని భావిస్తారు. కానీ లాల్‌రిథాంగి ఆలోచన మాత్రం అందుకు భిన్నం. పండించిన స్ట్రాబెర్రీలను విక్రయించడమే కాకుండా వాటితో ఎండు పండ్లు, క్యాండీలు తదితర ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు. ఇందుకోసం చిన్న స్థాయిలో కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు.

తాను సాధించిన విజయంతోనే సంతృప్తి చెందకుండా చుట్టుపక్కల మహిళా రైతులకు కూడా లాల్‌రిథాంగి సహాయపడుతున్నారు. స్ట్రాబెర్రీ సాగుపై తనకు తెలిసిన విషయాలను వారితో పంచుకుంటున్నారు. సాగులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ ఇతర మహిళలు కూడా ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఆమె కృషిని గుర్తించిన మిజోరం ప్రభుత్వం ఈ ఏడాది లాంగ్‌ట్లాయ్‌ జిల్లా ఉత్తమ రైతుగా ఎంపిక చేసింది.

అంతర్జాతీయ వేదికపై అరుదైన గుర్తింపు
లాల్‌రిథాంగి వ్యవసాయ ప్రయాణానికి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఆమెకు ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. అగ్రిఫుడ్‌ సిస్టమ్స్‌, గ్రామీణాభివృద్ధిలో విశేష కృషి చేస్తున్న మహిళలను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా వందమందిని ‘వరల్డ్‌ హండ్రెడ్‌ హీరోస్‌ ఆఫ్‌ విమెన్‌’ పురస్కారాలకు ఎంపిక చేశారు.

131 దేశాల నుంచి పోటీ ఉండగా భారత్‌ నుంచి ఇద్దరికి ఈ గుర్తింపు లభించింది. వారిలో లాల్‌రిథాంగి ఒకరు. ఈశాన్య భారతదేశం నుంచి ఈ గౌరవానికి ఎంపికైన తొలి మహిళగా ఆమె ప్రత్యేకత చాటుకున్నారు. అక్టోబరులో రోమ్‌లో జరిగే వరల్డ్‌ ఫుడ్‌ ఫోరంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

మారుమూల గ్రామంలో పుట్టి, సాధారణ రైతు కుటుంబంలో పెరిగి, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే వ్యవసాయంలో అసాధారణ విజయాన్ని సాధించడం వెనుక లాల్‌రిథాంగి పట్టుదల, ప్రయోగశీలత ఉన్నాయి. అవకాశాలు ఎక్కడో ఉండవని, వాటిని మనమే సృష్టించుకోవాలని ఆమె ప్రయాణం చాటిచెబుతోంది.