News

అనుమతి లేకుండా మతప్రబోధాలు చేస్తే OCI రిజిస్ట్రేషన్ రద్దు చేయొచ్చు: మద్రాస్ హైకోర్టు

10views

చెన్నై: భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత అధికారుల నుంచి ముందస్తు ప్రత్యేక అనుమతి పొందకుండా మతప్రబోధాలు, మిషనరీ కార్యకలాపాల్లో పాల్గొనే ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా -OCI కార్డుదారుల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయవచ్చని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మత మార్పిడులు జరిగినా, జరగకపోయినా ఒక మతానికి సంబంధించిన బోధనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం మిషనరీ కార్యకలాపాల పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది.

అమెరికా పౌరుడైన జాన్ డేనియల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ డి.భారత చక్రవర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. తన OCI రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం – FRRO తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు.

మతప్రచారానికి ముందస్తు అనుమతి తప్పనిసరి
జాన్ డేనియల్‌కు 2015లో OCI రిజిస్ట్రేషన్ లభించింది. అయితే ఆయన భారతదేశంలో పర్యటించిన సమయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో క్రైస్తవ మతప్రచార కార్యక్రమాలు, ప్రార్థనా సమావేశాలు నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్లు, సమావేశాల ప్రకటనలు, ఇతర ఆధారాలను కోర్టు ముందు ఉంచింది.

మరోవైపు, తాను భారతదేశానికి తల్లి, కుటుంబ సభ్యులను కలవడానికి మాత్రమే వస్తున్నానని, మతమార్పిడులు లేదా మిషనరీ కార్యకలాపాల్లో పాల్గొనలేదని డేనియల్ వాదించారు.

ఇరుపక్షాల వాదనలు, సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వం 2021 మార్చి 4న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం OCI కార్డుదారులు మిషనరీ, ప్రజా కార్యక్రమాలు, పర్వతారోహణ, జర్నలిజం వంటి నిర్దిష్ట కార్యకలాపాలు చేపట్టాలంటే సంబంధిత అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి పొందాలని స్పష్టం చేసింది.

ఒక మతానికి సంబంధించిన సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, మతబోధనలు చేయడం కూడా మిషనరీ కార్యకలాపాల కిందకే వస్తుందని పేర్కొంది. ఇందుకోసం ముందస్తు అనుమతి తప్పనిసరని, అనుమతి లేకుండా అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే OCI రిజిస్ట్రేషన్ రద్దుకు అవకాశం ఉంటుందని తెలిపింది.

తల్లి వద్దకు వెళ్లేందుకు సాధారణ వీసా తీసుకోవచ్చు
డేనియల్ తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించినప్పటికీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆయన మతపరమైన సమావేశాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన OCI రిజిస్ట్రేషన్ రద్దు చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. రిజిస్ట్రేషన్ పునరుద్ధరించాలన్న ఆయన అభ్యర్థనను తిరస్కరించింది.

అయితే, తన తల్లిని కలిసేందుకు డేనియల్ సాధారణ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. భవిష్యత్తులో భారతదేశంలో మతపరమైన సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మాత్రం సంబంధిత అధికారుల నుంచి అవసరమైన ముందస్తు అనుమతి పొందిన తర్వాతే చేపట్టాలని తేల్చిచెప్పింది.

ఈ తీర్పు ద్వారా OCI కార్డుదారులు భారతదేశంలో చేపట్టే మతప్రచార కార్యకలాపాలకు సంబంధించి ముందస్తు అధికారిక అనుమతి నిబంధనను మద్రాస్ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.