
దేశ రాజధాని న్యూఢిల్లీలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పర్వేష్ వర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్, ఆలయ ఛైర్మన్ సుమంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. స్వామివారి సన్నిధిలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు జరగనున్న ఈ వార్షిక పవిత్రోత్సవాలు నవంబర్ 1వ తేదీతో ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 30న పవిత్ర ప్రతిష్ఠ, స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అక్టోబర్ 31న పవిత్ర సమర్పణ కార్యక్రమం జరగనుంది.
చివరి రోజైన నవంబర్ 1న మహా పూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం నాలుగు మాడ వీధుల్లో స్వామివారి తిరుచ్చి ఉత్సవం వైభవంగా జరగనుంది.
ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా నిర్వహించే ఈ పవిత్రోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.





