
వైయస్సార్ కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో గోపురాలు కొత్త కళను సంతరించుకున్నాయి. పాచి పట్టి కళావిహీనంగా కనిపించిన ఆలయ గోపురాలకు మరమ్మతులు చేపట్టి పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారు.
తూర్పు (రాజమార్గం), ఉత్తర, దక్షిణ గోపురాల పరిస్థితిపై భక్తులు టీటీడీ, కేంద్ర పురావస్తుశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించారు. ఈ పనుల కోసం టీటీడీ రూ.96.85 లక్షలు కేటాయించేందుకు ముందుకొచ్చింది. రెండు నెలల క్రితం ప్రారంభించిన పనుల్లో భాగంగా మూడు ప్రధాన గోపురాలతో పాటు గర్భగుడిపై ఉన్న విమాన గోపురం, ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారపు పిట్టగోడకు కొత్త శోభ తీసుకొచ్చారు.
అలాగే సీతారాముల కల్యాణ వేదిక, రాములోరి ఎదుర్కోలు మండపం, రామలింగేశ్వరస్వామి ఆలయం, శ్రీవారి పోటు, యాగశాలలో దెబ్బతిన్న పైపూతను తొలగించి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. వర్షం పడినా నీరు లోపలికి రాకుండా అవసరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు జిల్లా పురావస్తుశాఖ అధికారి ఢాకారెడ్డి తెలిపారు.
పురాతన ఆలయ కట్టడాల పరిరక్షణతో పాటు వాటి వైభవాన్ని కాపాడేందుకు చేపట్టిన ఈ పనులతో భక్తులకు ఆలయం మరింత ఆకర్షణీయంగా కనిపించనుంది.





