ArticlesNews

పంజాబ్ నరమేధం: సిఖ్ఖులను ఊచకోత కోసిన కాంగ్రెస్ దాష్టీకం

4views

( 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు : చరిత్రలో చీకటి సంవత్సరం )

అమృత్‌సర్‌లో స్వర్ణమందిరంగా ఖ్యాతి గడించిన హర్‌మందిర్ సాహెబ్ సిక్కుల పుణ్యక్షేత్రం. ఇందిరాగాంధీ రాజకీయ కారణాలతో పెంచి పోషించిన జర్నెయిల్ సింగ్ భింద్రన్‌వాలే అనే ఖలిస్తానీ వేర్పాటువాది స్వర్ణమందిరాన్ని ఆక్రమించి తన స్థావరంగా మార్చుకున్నాడు. భింద్రన్‌వాలేను తుదముట్టించడానికి ఇందిర ప్రభుత్వం 1984 జూన్‌లో ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టి, స్వర్ణమందిరంలో కాల్పులు జరిపింది. ఆ ఆపరేషన్‌లో 5వేల మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారని స్వతంత్ర సిఖ్ఖు సంఘాలు లెక్కగట్టాయి. ఆ సంఘటనతో కాంగ్రెస్ అన్నా, ఇందిర అన్నా సిఖ్ఖుల్లో వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయింది.

ఆ కారణంగానే 1984 అక్టోబర్ 31న ఇద్దరు సిఖ్ఖులు ఇందిరాగాంధీని తుదముట్టించారు. దానితో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయాయి. సిఖ్ఖుజాతిని తుడిచిపెట్టేయాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఆ మేరకు కుట్రలు చేసారు. ఢిల్లీ మురికివాడలు, పరిసర గ్రామాల నుంచి అసాంఘిక శక్తులను సమీకరించారు. ట్రక్కులు, ఇనప రాడ్లు, కిరోసిన్ క్యాన్లు, పెట్రోల్ క్యాన్లు సేకరించారు. సిఖ్ఖుల ఇళ్ళు, దుకాణాలను గుర్తించి ఆనవాళ్ళు పెట్టారు. నవంబర్ 1 పొద్దెక్కగానే సిఖ్ఖుల ఊచకోత మొదలైంది.

ఇందిర మృతదేహానికి అంత్యక్రియలు మొదలవక ముందే సిఖ్ఖులపై దాడులు మొదలయ్యాయి. వారికి వ్యతిరేకంగా నినాదాలు మార్మోగాయి. దూరదర్శన్ ద్వారా ఆ నినాదాలు దేశమంతా ప్రతిధ్వనించాయి. రక్తానికి రక్తం కళ్ళ చూడాల్సిందే, సర్దార్‌లు దేశద్రోహులు, సిఖ్ఖులను చంపేయండి, వాళ్ళను చంపేసి వారి ఆస్తులు దోచుకోండి, ఏ ఒక్క సిఖ్ఖూ తప్పించుకోడానికి వీల్లేదు… అంటూ అగ్రనేతలు చేసిన నినాదాలు కాంగ్రెస్ శ్రేణులను ఉన్మత్తులను చేసాయి. ఆ నినాదాలు రోజంతా కొనసాగాయి. రాజీవ్‌గాంధీ సహా కాంగ్రెస్ నాయకులు ఎవరూ అలాంటి రెచ్చగొట్టే ధోరణిని నిలువరించలేదు.

కాంగ్రెస్ నాయకులు స్వయంగా రంగంలోకి దిగి సిఖ్ఖులపై మారణకాండకు నాయకత్వం వహించారు. కమల్‌నాథ్, వసంత్ సాఠే వంటి సీనియర్ నేతలు రకాబ్‌గంజ్ గురుద్వారాను చుట్టుముట్టి దాడి చేసిన గుంపులో ఉన్నారని నానావతి కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. జగదీష్ టైట్లర్, సజ్జన్‌కుమార్, హెచ్‌కెఎల్ భగత్ వంటి నాయకులు, కార్యకర్తలూ స్వయంగా దాడుల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోనే కాదు… పంజాబ్, హర్యానాల్లోనూ సిఖ్ఖులను ఊచకోత కోసారు. రహదారులపై బస్సులు, కార్లు, ఇతర వాహనాలను ఆపి వాటిలోని సిఖ్ఖులను బలవంతంగా బైటకు లాగి చితకబాదారు. సిఖ్ఖుల దుకాణాలు, హోటళ్ళను లూటీ చేసారు, తగులబెట్టారు. కాంగ్రెస్ గూండాల అకృత్యాలు ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకే పరిమితం కాలేదు. సిఖ్ఖులపై దేశవ్యాప్తంగా దాడులు జరిగాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ సిఖ్ఖులపై దాడులు, వారి ఆస్తులను ధ్వంసం చేసిన సంఘటనలు నమోదయ్యాయి.

అలాంటి కష్టకాలంలో సిఖ్ఖులకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అండగా నిలిచింది. ఆ విషయాన్ని ప్రముఖ రచయిత, జర్నలిస్టు కుష్వంత్ సింగ్ ధ్రువీకరించారు. ‘ఇందిరాగాంధీ హత్యకు ముందు, తర్వాతా ఢిల్లీ సహా పలు ప్రదేశాల్లో హిందూ సిఖ్ఖు ఐక్యత కోసం ఆర్ఎస్ఎస్ గణనీయమైన కృషి చేసింది. అల్లరిమూకలను రెచ్చగొట్టి 3వేల మందికి పైగా సిఖ్ఖులను చంపించినది కాంగ్రెసే. ఆ కష్టకాలంలో నిస్సహాయులైన సిఖ్ఖులకు అండగా నిలిచి వారిని రక్షించింది ఆర్ఎస్ఎస్, బీజేపీలే. ఢిల్లీలోని కొందరు టాక్సీ డ్రైవర్లను స్వయంగా అటల్ బిహారీ వాజపేయీ రక్షించారు’ అని ఖుష్వంత్ సింగ్ స్పష్టం చేసారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1984 సిఖ్ఖుల ఊచకోతలో ఢిల్లీలో 2800మంది, దేశవ్యాప్తంగా 3,350మంది ప్రాణాలు కోల్పోయారు. స్వతంత్ర సంస్థల అంచనాల ప్రకారం గరిష్ఠంగా 17వేల మంది సిఖ్ఖులను ఊచకోత కోసి చంపేసారు. కాంగ్రెస్ పార్టీ జరిపించిన దారుణ నరమేధమది. దానికి సంబంధించిన కేసుల్లో కొన్ని నేటికీ పరిష్కృతం కాలేదు. ఆనాటి విషాదం నుంచి ఇప్పటికీ వేలాది సిఖ్ఖు కుటుంబాలు కోలుకోలేదు.