
గోవధ కేసులో ముగ్గురు నిందితులకు గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా వేదాలు, హిందూ ధర్మం, మనుస్మృతిలో గోమాతకు ఉన్న విశిష్టతను అదనపు సెషన్స్ జడ్జి బి.ఆర్. రాజ్‌పూత్ తన తీర్పులో ప్రస్తావించారు.
ఆవు కేవలం ఒక జంతువు మాత్రమే కాదని, మానవ శ్రేయస్సుకు, ధర్మ పరిరక్షణకు మూలస్తంభంగా హిందూ సంప్రదాయంలో భావిస్తారని న్యాయమూర్తి పేర్కొన్నారు. తపస్సు ప్రభావంతో అమృత బిందువులు భూమిపై పడినప్పుడు దివ్యగోవు కామధేనువు ఆవిర్భవించిందని, సమస్త గోజాతికి కామధేనువే మూలమని హిందువుల విశ్వాసమని వివరించారు. గోమాత నాలుగు పాదాలను నాలుగు వేదాలకు ప్రతీకలుగా అభివర్ణించారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. గాంధీనగర్ జిల్లాలోని జమ్లా గ్రామంలో ముగ్గురు నిందితులు ఆవులు, గేదెలను వధించి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి వారి వద్ద నుంచి 277 కిలోల జంతు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు ముగ్గురికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.
కోర్టు తీర్పుపై ఉప ముఖ్యమంత్రి హర్షం
గోవధ కేసులో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించడంపై గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి హర్షం వ్యక్తం చేశారు. గోవులను వధించే వారిని చట్టం వదిలిపెట్టదని పేర్కొన్నారు. గోవధకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.





