News

స్వయంసేవకులందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు

13views
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలోని స్వయంసేవకులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. అంకితభావం, నిరంతరం శ్రమించే తత్వంతో సంఘ్‌ను ముందుకు తీసుకెళ్లిన మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సేవ, దేశ నిర్మాణం, సామాజిక బద్ధతతో సంఘ్ శతాబ్ది ఉత్సవాల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేసుకుందని కొనియాడారు. దేశ ప్రథమ ధ్యేయంగా ఎన్నో సంవత్సరాలుగా స్వయంసేవకులు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని తెలిపారు. నాగ్‌పూర్‌లో జరిగిన విజయదశమి వేడుకల్లో సంఘ్ ప్రముఖ్ డాక్టర్ మోహన్ భగవత్ చేసిన ప్రసంగం దేశ పురోగతికి, ఐక్యతకు ఎంతో మార్గదర్శకంగా నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు. అలాగే సమాజంలో సామాజిక మార్పును తెచ్చేందుకు ఉద్దేశించిన ‘పంచ పరివర్తన్’ సూత్రాల ప్రాముఖ్యతను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి మూలాలను మరింత బలపరచడంలో, సమాజంలో దేశభక్తి భావాలను నింపడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా స్వయంసేవకులు అందిస్తున్న సేవలు ఒక శక్తివంతమైన, ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి బలమైన పునాదిగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగ్‌పూర్‌లోని రేషింబాగ్ మైదానంలో ఆర్ఎస్ఎస్ తన 101వ వ్యవస్థాపక వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా సంఘ్ ప్రముఖ్ మోహన్ భగవత్ సంప్రదాయ పద్ధతిలో ఆయుధ పూజ (శస్త్ర పూజ) నిర్వహించారు. సంఘ్ సంస్థాపకులు డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు ప్రముఖులు పాల్గొని దేశ సేవలో స్వయంసేవకులు చేస్తున్న కృషిని అభినందించారు.