News

కులం కాదు, గుణంతోనే వ్యక్తికి గౌరవం అని నిరూపించిన ఆదికవి

5views

(ఆశ్వయుజ పూర్ణిమ వాల్మీకి మహర్షి జయంతి)

వాల్మీకి జయంతి సామాజిక సమానత్వం, మానవ అభ్యున్నతి అనే విలువలను గుర్తు చేసే గొప్ప సందర్భం. అడవిలో హింసావృత్తితో ఉదర పోషణ, కుటుంబ భరణమే ప్రయోజనంగా జీవించే రత్నాకరుడనే దోపిడీ దొంగ… ఆధ్యాత్మిక జ్ఞానం సాధించి మహర్షిగా ఎదిగిన పరిణామక్రమం ఆదర్శప్రాయం. ఏ వ్యక్తి అయినా తన గతం, సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా మార్పు, విముక్తి, గౌరవం సాధించగలరు అనడానికి వాల్మీకి మహర్షి ప్రతీక. మహర్షిగా మారాక ఆయన ఆదికవియై రచించిన రామాయణం భారతీయ సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక విలువలకు మూలకందమై నిలిచింది.

రత్నాకరుడు అనే దోపిడీదొంగ నారద మహర్షి కృపతో జీవిత వాస్తవాలను గ్రహించాడు. ఆధ్యాత్మిక జాగృతితో అందరికీ ఆదరణీయుడైన మహర్షి అయ్యాడు. తన చుట్టూ పుట్టలు కట్టినా పట్టించుకోనంత తీవ్ర తపస్సులో నిమగ్నమయ్యాడు. అజ్ఞానమనే వల్మీకాన్ని ఛేదించుకుని వాల్మీకిగా అవతరించాడు. ఎలాంటి మూలం కలిగిన వ్యక్తికైనా తన పరిస్థితుల నుంచి ఎదిగే అవకాశం ఉందని నిరూపించాడు.

రామాయణ కథానాయకుడు శ్రీరాముడు… మానవుడు సంతృప్తికరమైన జీవితంతో ఇతరులను రంజింపజేస్తూ తన గమ్యాన్ని చేరుకోవాలని చాటిచెప్పినవాడు. మనిషి మనిషిగా ఎలా జీవించాలో రాముడి ద్వారా చెప్పాడు వాల్మీకి. దొంగ నుంచి మహర్షి స్థాయికి ఆయన పరిణామం భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక చరిత్రలో ఒక గొప్ప సత్యానికి నిదర్శనం. ఒక వ్యక్తి పుట్టుక, కులంపై అతడి జ్ఞానం, మేధ, భక్తి ఆధారపడి ఉండవనడానికి వాల్మీకి మహర్షి ప్రతీక. వ్యక్తిని నిర్వచించేది అతనిపై సమాజంలోని అభిప్రాయాలు కాక అతని కర్మలు, ఆచరణలు, అంతర్గత పరిణామాలే అని ఆయన నిరూపించారు. అందుకే వాల్మీకి జయంతి… సామాజిక న్యాయం, సమానత్వం, కులవివక్ష విచ్ఛేదపు ఆవశ్యకతలను చాటుతూ… ఆధ్యాత్మిక ఉన్నతి ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదని నిరూపించే సందర్భం.

వాల్మీకి జీవితం, ఆయన రచనలూ అణగారిన వర్గాల పట్ల, బాధలు పడేవారి విషయంలో ఆయనకున్న ప్రగాఢ సానుభూతిని ప్రతిబింబిస్తాయి. అందుకే రామాయణం ఒక ఆధ్యాత్మిక నాయకుడి కథ మాత్రమే కాదు… మానవీయ భావోద్వేగాలు, నైతిక సందిగ్ధాలు, సామాజిక సందేశాల గాథ. ఎన్నో కష్టాలను, సామాజిక పరిహాసాలనూ ఎదుర్కొన్న సీత వంటి పాత్రల చిత్రణ… న్యాయం, నైతికత, కరుణ వంటి విషయాల్లో వాల్మీకి సున్నితత్వాన్ని ప్రతిఫలిస్తుంది. రామాయణాన్ని సంస్కృతకావ్యంగా రచించడం ద్వారా వాల్మీకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సామాన్య ప్రజలు అందరికీ అందుబాటులోకి తెచ్చి, వారి అభ్యున్నతికి పాటుపడ్డారు.

ఒక వ్యక్తిని… జన్మను బట్టి కాక అతని గుణగణాలను బట్టి గౌరవించే సంప్రదాయం భారతదేశంలో మొదటినుంచీ ఉందని ప్రపంచానికి చాటిచెప్పిన ఉదాహరణ వాల్మీకి. మన సాంస్కృతిక, ధార్మిక, సామాజిక వ్యవస్థలలోని వివక్షాపూరిత ధోరణి నుంచి బైటపడి దేశాన్ని మరింత సమానత్వ, సమ్మిళిత దృక్పథం వైపు పయనింపజేసే సందర్భమే మహర్షి వాల్మీకి జయంతి.