News

గిరిజన భాషలు భారతీయ భాషలే : ఆంధ్ర విశ్వవిద్యాలయం సదస్సులో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

3views

భాషను విడిచిపెట్టడం నాగరికతను వదులుకోవడమేనని ప్రఖ్యాత సాహితీవేత్త, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వ్యాఖ్యానించారు. భారతీయ భాషలన్నింటికీ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, అపారమైన శక్తి ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అడవులకే పరిమితమైన గిరిజన భాషలు ఎంతో ప్రాచీనమైనవని, అమూల్యమైనవని పేర్కొన్నారు. వాటిని పరిశోధనల ద్వారా కాపాడుకుంటూ మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

శుక్రవారం సాయంత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం అంబేడ్కర్ అసెంబ్లీ హాల్లో “గిరిజన భాషలు భారతీయ భాషలే” అనే అంశంపై ఏయూ, శక్తి ఫౌండేషన్ సంయుక్తంగా ఒక సదస్సు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి జొన్నవిత్తుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్, ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి. వేణుగోపాల్ రెడ్డి, యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.వి.ఆర్. రాజు తదితరులు పాల్గొన్నారు.

సదస్సులో జొన్నవిత్తుల ముఖ్య ప్రసంగం చేస్తూ.. గిరిజన భాషల్లో గొప్ప సంస్కృతి, నాగరికత నిండి ఉన్నాయని, వాటి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. అందుకోసం గిరిజన మాండలికాలు, పదజాలం, వారి సాంప్రదాయ వైద్య పరిజ్ఞానంపై విస్తృతంగా పరిశోధనలు జరగాలని సూచించారు. వారి కథలు, పాటలు, సామెతలు ఎంతో ఉన్నతమైనవని కొనియాడారు. గిడుగు రామమూర్తి రాసిన ‘సవర’ కథలు ఎంతో ప్రేరణ కలిగిస్తాయని గుర్తుచేశారు.

తెలుగు భాషకే ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం లభించడం లేదని, ఇలాంటి సమయంలో గిరిజన భాషలను కాపాడటం సవాలుతో కూడుకున్న పనని ఆయన అభిప్రాయపడ్డారు. భాషల మనుగడ కోసం ప్రజలు నిలబడాలని పిలుపునిచ్చారు. పిల్లలకు తెలుగు అక్షరాలు నేర్పకపోతే వారు ఎలా అభివృద్ధి చెందుతారని ప్రశ్నించారు. ప్రాథమిక విద్య కచ్చితంగా స్థానిక భాషల్లోనే సాగాలని స్పష్టం చేశారు. సొంత సంస్కృతిని, భాషలను దూరంచేసే ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరించాలని కోరారు.

మరొక అతిథి పి. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం విద్యాబోధన గిరిజన భాషల్లోనే జరగాలని తెలిపారు. 8వ తరగతి వరకు బోధన స్థానిక భాషలోనే సాగాలని కేంద్రం స్పష్టం చేసిందని, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలను అమలు చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక విద్యను గిరిజన ఉపాధ్యాయులే అందించేలా చూడాలని, ఆయా భాషల్లో పాఠ్యపుస్తకాలు ప్రచురించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సరిగ్గా వినియోగించడం, పెసా (PESA) చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు.

గిరిజన భాషల అభివృద్ధి కోసం అల్లూరి జిల్లా యంత్రాంగంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒప్పందం చేసుకుందని ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా గిరిజన భాషలు, ఆరోగ్యంపై విచారణ, పరిశోధనలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతీ గిరిజన భాషకు ప్రత్యేక లిపి అవసరమా అనే దానిపై భాషావేత్తలు పరిశోధన చేయాలని కోరారు. కృత్రిమ మేధ (AI) అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో నాలుగు లేదా ఐదు భాషలకు కలిపి ఒకే ఉమ్మడి లిపి సరిపోతుందేమో ఆలోచించాలని అభిప్రాయపడ్డారు. గిరిజన భాషలకు ప్రాచుర్యం కల్పించడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమానికి ముందు ప్రొఫెసర్ డి. సంధ్యా దీపిక స్వాగతోపన్యాసం చేయగా, ప్రొఫెసర్ పి.వి. లక్ష్మీనారాయణ అతిథులను పరిచయం చేశారు. వేడుకల్లో భాగంగా గిరిజన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.