(1947 అక్టోబర్ 26 – జమ్మూకశ్మీర్ విలీన దినం)
బ్రిటిష్ వలసపాలన నుంచి స్వతంత్రం పొందే క్రమంలో ముస్లింలీగ్ ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా భారతదేశం రెండుముక్కలయింది. బ్రిటిష్ ఇండియాలో ముస్లిములు మెజారిటీగా ఉన్న ప్రాంతాలతో పాకిస్తాన్ ఏర్పడింది. 1947 భారత స్వాతంత్ర్య చట్టం ప్రకారం అప్పటికి దేశంలో ఉన్న రాజసంస్థానాలకు భారత్ లేదా పాకిస్తాన్లో చేరే స్వేచ్ఛ ఇచ్చారు. పంద్రాగస్టు నాటికి 560 రాజసంస్థానాలు భారత్‌లో చేరాయి. జునాగఢ్, హైదరాబాద్, జమ్మూకశ్మీర్ ఏ దేశంలోనూ చేరకుండా ఉన్నాయి.
జమ్మూకశ్మీర్ సంస్థానంలో మెజారిటీ ప్రజలు ముస్లిములు. సంస్థానాధీశుడు మహారాజా హరిసింగ్ హిందువు. అతడు భారతదేశానికి అనుకూలంగా ఉండేవాడు. తన సంస్థానంలో వాణిజ్యం, కమ్యూనికేషన్స్, ప్రయాణాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పాకిస్తాన్‌తో యథాతథ స్థితి ఒప్పందం కుదుర్చుకున్నాడు. భారత్‌తో అలాంటి ఒప్పందం ఏదీ లేదు.
1947 అక్టోబర్‌లో పాకిస్తాన్‌లోని నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ నుంచి పష్తూన్ తెగకు చెందినవారు కశ్మీర్లోకి చొరబడ్డారు. ఆ గిరిజనుల మాటున పాక్ సైనికులు కూడా అక్రమంగా చొరబడ్డారు. వారు మహారాజా హరిసింగ్ ఉన్న శ్రీనగర్‌ను స్వాధీనం చేసుకోడానికి బయల్దేరారు. ఆ క్రమంలో ఉత్తర కశ్మీర్‌లోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించారు. అక్టోబర్ 26న బారాముల్లాలో 11వేల మంది సామాన్య ప్రజలను ఊచకోత కోసారు. ఆ పరిస్థితిని అదుపు చేయడం, పాక్ అక్రమ ఆక్రమణను అణచివేయడం కోసం హరిసింగ్ భారత సైన్యం జోక్యాన్ని కోరాడు. అదేరోజు ఆయన శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్ళి, నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రతినిధి వీపీ మీనన్‌తో భేటీ అయ్యాడు. తన భూభాగం కానిచోటకు భారత దేశం తన సైనిక బలగాలను పంపలేదని మీనన్ స్పష్టం చేసాడు. అప్పుడు మహారాజా హరిసింగ్ జమ్మూకశ్మీర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే ఒప్పందం మీద సంతకం పెట్టాడు. వెంటనే భారతసైన్యం అక్టోబర్ 27న తన సైనిక బలగాలను గగనతలం ద్వారా కశ్మీర్‌కు తరలించింది. రెండు వారాల్లో ఆక్రమణదారులను తరిమికొట్టింది. భారత్‌లో జమ్మూకశ్మీర్ విలీనాన్ని పాకిస్తాన్ ఒప్పుకోలేదు. దాంతో మొదటి కశ్మీర్ యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ సైనికులు, తిరుగుబాటుదారులు కలసి జమ్మూ వరకూ చొచ్చుకుని రావడానికి ప్రయత్నించారు.
ఆ సమయంలో జవహర్లాల్ నెహ్రూ చొరబాటుదారులను తరిమికొట్టకుండా వదిలేసాడు. మౌంట్‌బాటన్ సలహా మేరకు, జమ్మూకశ్మీర్ వ్యవహారాన్ని 1948లో ఐక్యరాజ్యసమితి ముందు పెట్టాడు. 1949 జనవరి 1న కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ ప్రాంతమే వాస్తవాధీన రేఖగా నిలిచిపోయింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో మూడింట రెండువంతులు భారత్ నియంత్రణలోకి వచ్చింది. గిల్గిట్, బాల్టిస్తాన్ ప్రాంతాలు పాకిస్తానీ బలగాల చేతిలో ఉండిపోయాయి.
మహారాజా హరిసింగ్ మొదటినుంచీ భారతదేశానికి అనుకూలంగా ఉండడం బ్రిటిష్ ప్రభుత్వానికి ఇష్టంలేదు. అందుకే జమ్మూకశ్మీర్‌ను వివాదాస్పదం చేసింది. నెహ్రూ సైతం తన తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేసాడు. అది వేరే కథ. ఏదేమైనా, 1947 అక్టోబర్ 26న హరిసింగ్ ఒప్పందంతో జమ్మూకశ్మీర్ భారతదేశంలో విలీనం అవడం అనే చారిత్రక ప్రక్రియ సాకారమైంది.




