
తెలుగునాట శతాబ్దాల క్రైస్తవ విస్తరణ చరిత్ర – 1వ భాగం
నదీతీరాల్లో సాంస్కృతిక విధ్వంసం
రాయలసీమ ప్రాంతంలో మతరక్కసి ఎలా కోరలు చాచి, నిరుపేదల కష్టాన్నీ, ఆపదల్నీ ఆసరాచేసుకుని విస్తరణకు పూనుకుందో చూశాం. ఇప్పుడు కోస్తా ప్రాంతానికి వద్దాం. కృష్ణ, గోదావరీ నదీతీర ప్రాంతంలో, బందరు, కాకినాడ, విశాఖ పట్నం వంటి రేవు పట్టణాల్లో 19వ శతాబ్దం ఉత్తరార్థంలో, క్రైస్తవ మిషనరీలు నిరుపేదలే లక్ష్యంగా మతమార్పిడులను విజయవంతంగా చేపట్టాయి. ఇది కృష్ణ, గోదావరి నదీ తీరాల్లో జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు, ప్రజా జీవనంలో సనాతన ధార్మిక వైభవంపై దుష్ప్రభావాన్ని చూపింది. ప్రాచీన ఆలయ సంపద జనపదాన్ని తీర్చిదిద్దింది. సాహిత్య సేవకు పునాదులు వేసింది. అలాంటి పవిత్రభూమిలో క్రైస్తవం జడలు విప్పింది. ఇవేమీ కల్పిత కథలు కావు. పరిశోధకులు, చరిత్రకారులు చెప్పినవే. హెర్బర్ట్ వేర్ రాసిన ‘క్రిష్టియన్ మిషన్స్ ఇన్ తెలుగు కంట్రీ’ పుస్తకం సహా అనేక ఇతర పరిశోధన పుస్తకాలను సంప్రదించి మాత్రమే చెపుతున్నవి.
19వ శతాబ్దం ఉత్తరార్థంలో కృష్ణా, గుంటూరు, రాజమండ్రి సహా తూర్పు తీరంలో విశాఖపట్నంలో రకరకాల పేర్లతో క్రైస్తవ మిషనరీలు దళితులే లక్ష్యంగా మతమార్పిడి కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. గోదావరి డెల్టాతో పాటు దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ఒంగోలు ప్రాంతాలకు మిషన రీలు విస్తరించాయి. గోదావరి డెల్టాలో అయినా, తూర్పు తీరంలో అయినా, దక్షిణ కోస్తాలో అయినా ప్రధానంగా దళితులనే లక్ష్యంగా చేసుకున్నాయి ఈ మిషనరీలు.
కృష్ణా జిల్లాలోని ఉత్తర ప్రాంతంలో చర్చి మిషనరీ సొసైటీ, రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లో అమెరికన్ ఎవాంజెలికల్ లూథరన్ చర్చి, విశాఖ పట్నంలో లండన్ మిషనరీ సొసైటీ, కాకినాడలో కెనడియన్ బాప్టిస్ట్ మిషన్, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ సొసైటీలు మతమార్పిడులు మొదలుపెట్టాయి. ఎస్సీలనే లక్ష్యంగా చేసుకున్నాయి. ఇక్కడ చెపుతున్న వాస్తవాలను ఎవరైనా రూఢీ చేసుకోవాలంటే వి.శాంతకుమారి రాసిన Church Missionary Society in Coastal Andhra, 1850-1950: Mediating Change among the Malas ఆర్టికల్ చదవవచ్చు. క్రైస్తవ మిషనరీలు ఎక్కడా కూడా నేరుగా మతమార్పిడి అనే మాటను ఉపయో గించవు. ఎస్సీలకు విద్య, వైద్యం, ఆర్థిక స్వావలంబన పేరిట, వారికి దగ్గరై, క్రమంగా వారిని స్వస్థత సభలకు ఆహ్వానించడం, అక్కడి నుంచి వారిని విజయవంతంగా దారి మళ్లించడమే మిషనరీల లక్ష్యం. మరీ ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతంలోని నదీ, సముద్ర తీర ప్రాంతాల్లో ఎస్సీ జనాభా చాలా అధికం. విసిరేసినట్టు ఉండటం కాకుండా, ఒకేచోట కొన్ని వేల కుటుంబాలు ఉండటంతో, ఈ ప్రాంతాలను తమ లక్ష్యంగా మిషనరీలు ఎంపిక చేసుకున్నాయి. దీంతోపాటు అప్పటికే ఆంగ్లేయుల పాలన ఉండటం కూడా వాటికి అనుకూలించింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో, ఎస్సీ జనాభా ఉన్న ప్రాంతంలో 1850 నుంచి 1950 వరకు, సుమారు వందేళ్ల కాలంలో, కొన్నివేల ఎస్సీ కుటుంబాలు మతమార్పిడికి గురయ్యాయి. 1766లో కోస్తాంధ్ర ప్రాంతం నిజాం అధీనంలో నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలోకి రావడంతో మిషనరీ కార్యకలాపాలకు మార్గం సుగమం అయ్యింది.
కోస్తా ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వ్యాపారం మాత్రమే చేయలేదు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లోని ప్రజల సాంస్కృతిక వారసత్వాన్ని, సనాతన ధర్మంపై వారికి గల విశ్వాసాలను తుడిచిపెట్టేయాలనేది దాని లక్ష్యం. వాణిజ్యం కోసం ప్రవేశించి, మతమార్పిడులు చేసి, ఆ తర్వాత, పాలనా యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో 1859 నుంచి 1877 మధ్య సుమారు 56వేల కుటుంబాలు బాప్టిజం తీసుకున్నాయనే లెక్కలున్నాయి. బ్రిటీష్ ఇండియాలోని గెజిట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఆయా ప్రాంతాల జనాభా నిష్ఫత్తి ఎలా మారిందో తెలుస్తుంది. సర్కారు జిల్లాలుగా పిలిచే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ కొన్ని వేల కుటుంబాలు ఈ కాలంలోనే క్రైస్తవాన్ని స్వీకరించాయి. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో 1850 నుంచి 1900వరకు రాగానే క్రైస్తవ జనాభా పెరగడమే కాదు, చర్చి ఆస్తులు సైతం భారీగానే పెరిగాయి. ఆ కాలంలో కూడగట్టిన ఆస్తుల మూలంగానే ఇటీవలి కాలంలో చర్చి ఆస్తులపై ఆధిపత్యం కోసం క్రైస్తవుల్లోని రెండు వర్గాలు బాహటంగా ఘర్షణకు దిగిన ఘటనలు చూశాం. ఆంధ్రా ఎవాంజెలికల్ లూథరన్ చర్చిపై ఆధిపత్యం కోసం ఇద్దరు పాస్టర్ల మధ్య తగాదా సుప్రీం కోర్టు దాకా వెళ్లిందంటే, దాని ఆస్తి ఏ స్థాయిలో ఉన్నదీ ఊహించుకోవచ్చు. మిషనరీల ప్రభావంతో క్రైస్తవ జనాభా పెరగడంతో, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, క్రైస్తవులకు విలువైన భూములను ప్రభుత్వం ఇవ్వాల్సి వచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్చిలకు సంబంధించిన ఆస్తులు సుమారు 1,000 వరకు ఉంటాయని అంచనా. ఈ ఆస్తుల విలువ కొన్ని వందల కోట్ల రూపాయలకు చేరడంతో హత్యలు, హత్యాయత్నాలు మొదలయ్యాయి. చర్చి ఆస్తులను ఆక్రమిస్తున్నారనే పేరిట 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా The Protection of Christian Properties from Illegal Sale and Occupation Act పేరిట ఓ చట్టమే చేసింది. మతమార్పిడి సందర్భంలో ఆస్తుల సంగతి ఎందుకు అనుకుంటున్నారేమో? కానీ ఇబ్బడిముబ్బడిగా క్రైస్తవ జనాభా పెరగడంతో ప్రభుత్వాలు, ప్రైవేటు వ్యక్తుల ద్వారా చర్చిలకు పెద్ద ఎత్తున ఆస్తులు సమకూరాయి. ఈ ఆస్తులపై ఆధిపత్యం కోసం రాజకీయ ప్రాబల్యాన్ని చర్చిలు పెంచుకున్నాయి. కోస్తా ప్రాంతంలో మతమార్పిడులు ముఖ్యంగా దళితుల బాప్టిజం స్వీకరణ గురించి తెలుసుకోవాలంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా(సీఎసఐ) డాక్యుమెంట్లను, చారిత్రక పత్రాలను పరిశీలిస్తే చాలు. ఎస్సీల్లో ఓ సామాజిక వర్గం లక్ష్యంగా మిషనరీలు మతమార్పిడులు చేశాయని సీఎసఐ డాక్యుమెంట్లు చెపుతున్నాయి.
మచిలీపట్నంలో జనరల్ పీటర్ ఆధ్వర్యంలో 1810లోనే చర్చి కార్యక్రమాలు మొదలై క్రమంగా ఊపందుకున్నాయి. మత్స్యకార సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మతమార్పిడులు చేయాలని చూస్తే, వ్యతిరేకత కనపరిచినట్టు మచిలీపట్నంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశం తర్వాత జరిగిన చారిత్రక ఘటనలు చూస్తే తెలుస్తుంది. రెవరెండ్ జాన్ టక్కర్, ఆనాడు కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేసిన జాన్ గోల్డింగామ్లు 1836లో చర్చి మిషన్ సొసైటీని స్థాపించి మతమార్పిడులను మొదలుపెట్టారు. దీన్ని ‘తెలుగు మిషన’గా పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని ఉత్తర ప్రాంతంతో పాటు మచిలీపట్నంపై సీఎసఐ దృష్టి సారించింది. మతమార్పిడులను ప్రోత్సహిం చింది. అందుకే ఇప్పుడెవరైనా వెళ్లి పరిశీలించినా, ఆ ప్రాంతాల్లో క్రైస్తవ ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 1830 నాటికి కోస్తా గ్రామీణ ప్రాంతాల్లోని కుల జనాభాకు 1876 నాటికి ఉన్న కుల జనాభాకు చాలా వ్యత్యాసం వచ్చింది. క్రైస్తవం స్వీకరించినవారు తమను తాము క్రైస్తవులుగా చెప్పుకున్నారు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటివారు మళ్లీ తమ కుల అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, రిజర్వేషన్లు పొందడం మొదలు పెట్టారు. విశ్వాసంలో మాత్రం తాము క్రైస్తవుల మంటూ చెప్పుకున్నారు.
రెవరెండ్ జాన్ టక్కర్ ఆధ్వర్యంలో సీఎసఐ కార్యకలాపాలు క్రమంగా ఏలూరు, బెజవాడ, రాఘవాపురం, ఖమ్మంమెట్టు, డోర్నకల్ వరకూ పాకాయి. రాయలసీమలో కర్నూలు నుంచి మొదలుపెట్టి మొత్తం సీమ ప్రాంతంలో మిషనరీ కార్యక్రమాలు విస్తరించాయి. చిత్తూరు ఇందుకు కొంత మినహాయింపు. 1888లో ఖమ్మం మెట్టు మిషనరీ కార్యక్రమాలకు ప్రధానంగా మారి, ఇటు తెలంగాణలోకి విస్తరించింది. బ్రిటీష్ సామ్రాజ్య విస్తరణ ఎంత దీర్ఘకాలిక ప్రణాళికతో, క్రమబద్ధంగా, పద్ధతిగా సాగిందో, మిషనరీ కార్యకలాపాలు కూడా అలాగే ముందు ఒక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని, అక్కడి నుంచి మొత్తం ప్రాంతాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవడమనే పద్ధతిని పాటించాయి. కర్నూలు కేంద్రంగా రాయలసీమను, కృష్ణా జిల్లా కేంద్రంగా మొత్తం కోస్తా ప్రాంతాన్ని, అటు తూర్పు తీరంలో విశాఖ పట్టణం కేంద్రంగా చేసుకుని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కబళించాయి. తెలుగుసీమలో మిషనరీ కార్యక్రమాలను నిశితంగా అధ్యయనం చేస్తే, మొత్తం బ్రిటీష్ ఇండియా చరిత్రను మరోకోణం నుంచి చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ బ్రిటీష్ పాలనను ఆధునికతను తెచ్చిన కాలంగా పరిగణించే చారిత్రక ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించి, మతపరమైన ఆధిపత్యాన్ని రుద్దిన పాలనకాలంగా, దేశీయ చింతనను, విశ్వాసాలను, సాంస్కృతిక సంపదను ధ్వంసం చేసిన కాలంగా పరిగణించాల్సి ఉంటుంది.




