News

9 మంది ఐసిస్‌ సభ్యులపై ఎన్‌ఐఏ చార్జిషీటు

3views

విజయవాడ ఉగ్రమూలాల కేసులో ఎన్‌ఐఏ ఛార్జ్​షీట్​​ దాఖలు చేసింది. విజయవాడలో ఎన్‌ఐఏ కేసులు విచారించే ప్రత్యేక కోర్టులో మొత్తం తొమ్మిది మందిపై అభియోగపత్రాన్ని ఫైల్‌ చేశారు. ఈ ఘటనపై ఈ ఏడాది మార్చి 23న విజయవాడ రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పలు రాష్ట్రాలతో ముడిపడిన కేసు కావడంతో ఏపీ పోలీసుల వినతి మేరకు కేసు ఎన్‌ఐఏకు బదిలీ అయింది.

ఈ ఏడాది మార్చిలో చివరలో విజయవాడ సహా పట్నా, దిల్లీ, పశ్చిమ బంగాల్, బీహార్, కర్ణాటక, తెలంగాణలో ఉగ్రవాదుల సానుభూతిపరులను విజయవాడ పోలీసులు, సీఐ సెల్‌ విబాగం అరెస్ట్ చేసింది. సామాజిక మాధ్యమాల ద్వారా జిహాదీ భావజాలాన్ని వీరు వ్యాపింపజేశారు. ఇందులో మహ్మద్ రెహ్మతుల్లా షరీఫ్‌ (ఏ1), మహ్మద్‌ డానిష్‌ (ఏ2), మీర్జా సొహైల్‌ బేగ్‌ (ఏ3), లక్కీ అహ్మద్‌ (ఏ7) జిషాన్‌ అబ్దుల్‌ మజీద్‌ (ఏ9), మీర్‌ ఆసిఫ్‌ అలీ (ఏ10), అబ్దుల్‌ సలాం (ఏ11), షారుఖ్‌ఖాన్‌ (ఏ12), షేక్‌ ఫైజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (ఏ13)పై ఆధారాలు లభించాయని ఎన్‌ఐఏ పేర్కొంది. ఉగ్ర సంస్థ ఐసిస్‌లో వీరు సభ్యులుగా చేరారని ఛార్జ్​షీట్​లో తెలిపింది.

నిందితులు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా భారత్‌లో ఐసిస్‌ కార్యకలాపాలను విస్తరించేందుకు కుట్ర పన్నారు. దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు భంగం కలిగించేలా నిందితులు వ్యవహరించారు. పలువురు యువకులను జిహాదీ భావజాలం వైపు ఆకర్షితులను చేసి వారికి ఆయుధాలలో శిక్షణ ఇప్పించేందుకు, పేలుడు పదార్థాల తయారీకి కూడా సిద్ధపడ్డారు. ఒకరికొకరు నేరుగా పరిచయం లేనివారందరితో ఆన్‌లైన్‌లో నెట్‌వర్క్‌ ఏర్పాటుచేసి వారిని ఆపరేటర్లుగా వాడుకుని భారత్‌లో విధ్వంసానికి పాల్పడాలనేది ఐసిస్, అల్‌ఖైదాల కుట్ర.

‘ఖవాతీన్‌’ పేరిట ఏకంగా ప్రత్యేక గ్రూప్​ : మరోవైపు జిహాదీ కార్యకలాపాల్లో మహిళలను భాగస్వాముల్ని చేసేందుకు విదేశీ హ్యాండ్లర్లు మహిళలతో ‘ఖవాతీన్‌’ పేరిట ఏకంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా మహిళల్ని ఈ ఉచ్చులోకి లాగేవారు. ఈ కేసులో చిక్కిన హైదరాబాద్‌కు చెందిన సైదాబేగం ఖవాతీన్‌ బాధ్యతలు చూసేవారు. దీనికి తగ్గట్లుగా నిందితులు కమ్యునికేషన్‌ కోసం సురక్షితమైన అప్లికేషన్‌ను కూడా అభివృద్ధి చేసి, పరీక్షించారు. దీని ద్వారా రహస్యంగా సంభాషణలు సాగించేందుకు ప్రణాళిక రచించారు. దీన్ని వారి ఉగ్ర కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన నిందితులపై కూడా త్వరలో ఛార్జ్​షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.