News

మసూద్‌ అజార్‌ ఆఫ్ఘన్‌లో ఉన్నాడంటూ కబుర్లు.. పాక్‌లోనే ఉన్నాడని భారత్‌ వద్ద పక్కా సమాచారం!

14views

ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌ (జేఈఎం) చీఫ్‌ మసూద్‌ అజార్‌ ఎక్కడున్నాడనే అంశంపై పాకిస్థాన్‌, భారత్‌ వాదనలు భిన్నంగా ఉన్నాయి. అజార్‌ ఆఫ్ఘనిస్థాన్‌లో దాక్కున్నాడంటూ పాకిస్థాన్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) ప్రకటించింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి బహుమతిని రూ.70 లక్షల పాకిస్థానీ కరెన్సీకి పెంచింది. అయితే అజార్‌ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఎఫ్‌ఏటీఎఫ్‌ (ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌) దృష్టిలో తమపై ఒత్తిడి పెరుగుతున్న సమయంలో పాకిస్థాన్‌ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అజార్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ సమాజానికి చూపించేందుకే బహుమతిని పెంచినట్లు పాకిస్థాన్‌ వ్యవహారాలను పరిశీలిస్తున్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పాక్‌లోనే ఉన్నాడంటున్న భారత్‌
అజార్‌ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు చెందిన ఓ అధికారి ప్రకారం.. గత ఏడాది ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో అతడు బహావల్‌పూర్‌లోనే ఉన్నాడు. అయితే జైషే మహ్మద్‌ ప్రధాన కార్యాలయంపై దాడి జరగడంతో వెంటనే అతడిని రావల్పిండిలోని కంబైన్డ్‌ మిలిటరీ హాస్పిటల్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

అజార్‌కు దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం సమస్య ఉందని, అందుకే రావల్పిండి ఆసుపత్రికి అతడు అప్పుడప్పుడు వస్తుంటాడని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత అతడిని పాకిస్థాన్‌లోని మూడు, నాలుగు ప్రాంతాలకు పలుమార్లు తరలించినట్లు భారత వర్గాలు వెల్లడించాయి.

నవాబ్‌షా, స్కర్దులో సేఫ్‌హౌస్‌లు?
భద్రతా కారణాలతో అజార్‌ను ఎక్కువ కాలం ఒకే చోట ఉంచడం లేదని అధికారులు చెబుతున్నారు. సింధ్‌ ప్రావిన్స్‌లోని నవాబ్‌షా నగరంలో అతడిని తరచూ ఉంచుతున్నట్లు భారత నిఘా సమాచారం ఉందని పేర్కొన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని స్కర్దులోనూ అతడికి మరో సేఫ్‌హౌస్‌ ఉన్నట్లు తెలిపారు.

పీవోకేలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో అక్కడ ఉగ్రవాదుల నియామకాన్ని పాకిస్థాన్‌ తాత్కాలికంగా నిలిపివేసిందని అధికారులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులకు అనుగుణంగా జేఈఎం కొత్త వ్యూహాలు అనుసరిస్తోందని, ముసుగు సంస్థల ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశాలే లక్ష్యమా?
మసూద్‌ అజార్‌ను ఆఫ్ఘనిస్థాన్‌కు తరలించడం పాకిస్థాన్‌కు సాధ్యం కాదని భారత అధికారులు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్‌తో సంబంధాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో అతడిని అక్కడికి పంపే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు.

అజార్‌పై బహుమతి ప్రకటించడం పాకిస్థాన్‌కు ఇదే తొలిసారి కాదు. 2021లోనూ ఎఫ్‌ఐఏ రూ.50 లక్షల పాకిస్థానీ కరెన్సీ బహుమతి ప్రకటించింది. అయినా ఆ తర్వాత అతడిపై గానీ, జేఈఎంపై గానీ పెద్దగా మార్పు కనిపించలేదని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

అక్టోబర్‌ 26-30 మధ్య పారిస్‌లో జరగనున్న ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశాలు పూర్తయ్యే వరకు అజార్‌ దేశం బయట ఉన్నాడనే భావన కలిగించేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోందని భారత అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే అజార్‌ అసలు ఎక్కడున్నాడనే అంశంపై పాకిస్థాన్‌ వాదనలను ఆఫ్ఘన్‌ తాలిబన్‌ కూడా గతంలో తిరస్కరించింది.