News

మచిలీపట్నం సాగర తీరంలో 63 అడుగుల మహాగణపతి.. ఘనంగా ఉత్సవాలు

24views

కృష్ణాజిల్లా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 14 నుంచి 24వ తేదీ వరకు మచిలీపట్నం సాగర తీరంలో నిర్వహించనున్న 63 అడుగుల విజయ గణపతి, సాగర తీర మహాగణపతి ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడుక ఫంక్షన్‌ హాల్‌లో నగర ప్రముఖులు, అధికారులు, వ్యాపారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో మంత్రి సమావేశమై ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. 2027లో మచిలీపట్నం పోర్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా ఈ మహాగణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంస్కృతిక, దైవిక కార్యక్రమాలతో 63 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా వేద పండితులు, రుత్వికుల సమక్షంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఉత్సవాల్లో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు పాల్గొనేలా హోమాలు, యజ్ఞాలు, యాగాలు, విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా ప్రజలు కుటుంబ సమేతంగా మచిలీపట్నం సాగర తీరానికి తరలివచ్చి కొలువుదీరనున్న మహాగణపతిని దర్శించుకోవాలని కోరారు. అలాగే ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల నమూనా ఆలయాలను సందర్శించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని సూచించారు.

బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఉత్సవాల్లో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను సమావేశంలో వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు, ఉత్సవ నిర్వాహకులు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. భద్రత, పారిశుద్ధ్యం, ట్రాఫిక్‌ నియంత్రణ, తాగునీరు, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు, ఉత్సవ నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. భక్తుల భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, ట్రాఫిక్‌ నియంత్రణ, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.