
ఇజ్రాయెల్: ఉత్తర ఇజ్రాయెల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మోషవ్ అవియెల్‌లో వందలాది మంది కృష్ణ భక్తులు ‘హరే రామ.. హరే కృష్ణ’ నామస్మరణతో సందడి చేశారు. విశేషమేమిటంటే.. ఈ వేడుకల్లో పాల్గొన్న వారిలో అధిక శాతం మంది యూదులే కావడం విశేషం.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శుక్రవారం అవియెల్‌కు చేరుకుని శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. స్థానిక సాంస్కృతిక కేంద్రాన్ని శ్రీకృష్ణుడి చిత్రాలు, బొమ్మలతో భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించేలా అలంకరించారు. ఇజ్రాయెల్‌లో ‘హరే కృష్ణాస్’గా పిలిచే భక్తులు ఆటపాటలతో వేడుకలకు మరింత శోభ తీసుకొచ్చారు.
రాధాకృష్ణుల సందేశంతో నాటకం
వీనులవిందైన సంగీతం మధ్య రాధాకృష్ణుల జీవన సందేశాన్ని చాటిచెప్పే నాటకాన్ని భక్తులు ప్రదర్శించారు. భక్తిగీతాలు, నామసంకీర్తనలతో కార్యక్రమ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
వేడుకలకు హాజరైన వారికి 108 రకాల శాకాహార వంటకాలతో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. కృష్ణభక్తిలోని ఆధ్యాత్మికతను, భారతీయ సంస్కృతిలోని భక్తి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించారు.
బృందావన్.. మాయాపుర్ సందర్శనతో కృష్ణతత్వంపై ఆసక్తి
వేడుకల్లో పాల్గొన్న పలువురు భక్తులు గతంలో భారత్‌లోని బృందావన్, మాయాపుర్ ప్రాంతాలను సందర్శించిన సందర్భంగా కృష్ణతత్వాన్ని అధ్యయనం చేసినట్లు తెలిపారు. శ్రీకృష్ణుడి బోధనలు, భక్తి మార్గం పట్ల ఆకర్షితులైన వారు ఇజ్రాయెల్‌లోనూ హరినామ సంకీర్తన, ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
ప్రతి ఏడాది గౌర పూర్ణిమతో పాటు జన్మాష్టమి వేడుకలను ఇజ్రాయెల్‌లోని హరే కృష్ణ భక్తులు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. యూదులలోనూ శ్రీకృష్ణ భక్తి పట్ల పెరుగుతున్న ఆసక్తికి ఈ వేడుకలు నిదర్శనంగా నిలిచాయి.




