News

గిరిజన రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం.. పార్వతీపురం మన్యంలో అగ్రి క్లినిక్‌

2views

పార్వతీపురం మన్యం: గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పంటలకు మార్కెటింగ్‌ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో అగ్రి క్లినిక్‌ ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, నీటి సంరక్షణ, అనుబంధ రంగాలను సమగ్రంగా అనుసంధానం చేసి రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అగ్రి క్లినిక్‌ను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకర రెడ్డి ప్రారంభించారు.

గిరిజన రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, సస్యరక్షణ, ప్రకృతి సేద్యం, ప్రభుత్వ పథకాలు, మార్కెటింగ్‌ అంశాలపై ఒకే వేదిక ద్వారా సమగ్ర సేవలు అందించడమే అగ్రి క్లినిక్‌ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్‌ తెలిపారు.

ప్రకృతి సేద్యం, జల సంరక్షణ, డిజిటల్‌ వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భూసారాన్ని పరిరక్షించడంతో పాటు పర్యావరణహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌ సహకారంతో పీవీటీజీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో సమగ్ర వ్యవసాయ విధానాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

రైతులకు మెరుగైన ఉపాధి అవకాశాలతో పాటు వారు పండించిన పంటలకు మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. మార్టు కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన అగ్రి క్లినిక్‌ ద్వారా గిరిజన రైతులకు సాగు నుంచి మార్కెటింగ్‌ వరకు అవసరమైన సాంకేతిక, వ్యవసాయ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.