
అనకాపల్లి :ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆలయాలు, భజన మందిరాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను పెంచింది. పెరిగిన నిర్మాణ వ్యయాలకు అనుగుణంగా నిధులను మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ ఇన్‌ఛార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
టిటిడి శ్రీవాణి ట్రస్టు నిధులతో జిల్లాలో 34 ఆలయాలు, భజన మందిరాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయా నిర్మాణాలు పూర్తిచేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన మేరకు నిధులను పెంచారు.
ఇప్పటివరకు స్థల విస్తీర్ణం ఆధారంగా మూడు కేటగిరీల్లో నిధులు మంజూరు చేసేవారు. ఐదు సెంట్ల స్థలం ఉంటే రూ.10 లక్షలు, ఎనిమిది సెంట్లు ఉంటే రూ.15 లక్షలు, పది సెంట్లకు పైగా ఉంటే రూ.20 లక్షలు ఇచ్చేవారు. అయితే నిర్మాణాలు పూర్తయిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మొత్తాలను పెంచింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం ఐదు సెంట్లకు పైగా స్థలం ఉంటే రూ.20 లక్షలు, ఎనిమిది సెంట్లు దాటితే రూ.30 లక్షలు, పది సెంట్లకు పైగా ఉంటే రూ.40 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయనున్నారు.
అనకాపల్లి జిల్లాలోని కుంచంగిలో గౌరీపరమేశ్వరుల ఆలయం, అనకాపల్లి పట్టణంలోని భీమునిగుమ్మంలో సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.40 లక్షల చొప్పున నిధులు మంజూరైనట్లు కూటమి నాయకులు రామకృష్ణ తెలిపారు.




