News

పాకిస్థాన్‌లో కూల్చివేసిన హిందూ ఆలయం పునర్నిర్మాణం

6views

లాహోర్: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ నరోవాల్ జిల్లాలో కూల్చివేయబడిన 125 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హిందూ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాల కారణంగానే ఆలయంలోని కొంత భాగం దెబ్బతిన్నదని ప్రభుత్వం పేర్కొంటూ, ఆ ప్రాంతంలో మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చింది.

పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ అంశంపై స్పందించింది. మైనారిటీ వ్యవహారాల మంత్రి సర్దార్ రమేష్ సింగ్ అరోరా ఆలయాన్ని సందర్శించినట్లు ‘ఎక్స్‌’ వేదికగా ప్రభుత్వం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా ఆలయ సైన్‌బోర్డులోని కొంత భాగం మాత్రమే కిందపడినట్లు మంత్రి పరిశీలనలో గుర్తించారని తెలిపింది. దెబ్బతిన్న ప్రాంతానికి అవసరమైన మరమ్మతులు చేపడతామని స్పష్టం చేసింది.

ఆలయానికి ఆనుకుని ఉన్న భూమిని మదర్సాకు కేటాయించినప్పటికీ, ఆలయానికి చెందిన భూమిని మాత్రం ఎవరికీ లీజుకు ఇవ్వలేదని పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. మతపరమైన ప్రార్థనా స్థలాలకు సంబంధించిన అంశాలు అత్యంత సున్నితమైనవని, ఇలాంటి విషయాల్లో వెలువడే ప్రతి వాదన వాస్తవమా కాదా నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

అయితే, పాకిస్థాన్‌లోని ‘డాన్’ పత్రిక గతంలో ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆలయ ప్రాంగణాన్ని సమీపంలోని మదర్సాకు కేటాయించినట్లు కథనం ప్రచురించింది. దీంతో ఆలయ భూమి, కూల్చివేతకు సంబంధించిన అంశంపై వివాదం నెలకొంది.

నరోవాల్ జిల్లా సిరాజ్ గ్రామంలో ఉన్న ఈ 125 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హిందూ ఆలయం గత నెలలో కూల్చివేయబడింది. ఆలయ ప్రాంగణాన్ని పక్కనే ఉన్న మదర్సాలో విలీనం చేసేందుకే ఆలయాన్ని తొలగించారని స్థానికులు ఆరోపించారు. నిషేధిత సంస్థ తహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ)తో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ కూల్చివేతలో పాల్గొన్నారని కూడా ఆరోపణలు వచ్చాయి.

ఆలయ కూల్చివేతపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం పునర్నిర్మాణానికి హామీ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆలయం ఎలా పునర్నిర్మిస్తారు, పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అనే అంశాలపై ప్రభుత్వం మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.