News

రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ను ముస్లింల ద్వేషిగా చిత్రీకరించారు : సాత్యకి

3views

హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్‌కు ముస్లింలపై ఎన్నడూ ద్వేషం లేదని, పైగా వారి పురోభివృద్ధికి తన రచనల్లో దిశానిర్దేశం చేశారని ఆయన మనవడు సాత్యకి సావర్కర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన వ్యాఖ్యల ద్వారా సావర్కర్‌ను తీవ్ర ముస్లిం ద్వేషిగా చిత్రీకరించారని ఆయన ఆరోపించారు.

రాహుల్ గాంధీపై సాత్యకి దాఖలు చేసిన పరువునష్టం దావాకు సంబంధించి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సాత్యకిని అడ్వకేట్ మిలింద్ పవార్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.

2023లో లండన్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “సావర్కర్ తన ఐదారుగురు స్నేహితులతో కలిసి ఒక ముస్లిం యువకుడిపై దాడి చేసి ఆనందం పొందానని తన పుస్తకంలో రాసుకున్నారు” అని అన్నట్లు సాత్యకి గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా సావర్కర్‌ను ఒక మూకదాడికి పాల్పడే వ్యక్తిగా చూపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“ఈ మాటల వల్ల సావర్కర్‌ను తీవ్ర ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరించారు. కానీ ఆయనెప్పుడూ ముస్లింలను ద్వేషించలేదు. తన రచనల్లో వారి అభివృద్ధికి మార్గాలు సూచించారు” అని సాత్యకి కోర్టుకు వివరించారు. రాహుల్ గాంధీ పేర్కొన్నట్లుగా ముస్లిం యువకుడిపై దాడి జరిగిన ఘటన సావర్కర్ రాసిన ఏ పుస్తకంలోనూ లేదని ఫిర్యాదుదారు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.