News

పాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయం కూల్చివేతను తీవ్రంగా ఖండించిన భారత్

30views

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ నరోవాల్ జిల్లాలో శతాబ్దం నాటి హిందూ ఆలయాన్ని కూల్చివేసినట్లు వచ్చిన వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను ‘అత్యంత అభ్యంతరకరమైన విధ్వంసక చర్య’గా అభివర్ణిస్తూ.. దీనిపై తక్షణమే పారదర్శక విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌ను కోరింది.

లాహోర్‌కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలోని నరోవాల్ జిల్లా సిరాజ్ గ్రామంలో ఉన్న సుమారు 100 ఏళ్ల నాటి హిందూ ఆలయాన్ని ఆగస్టు 21న కూల్చివేసినట్లు సమాచారం. ఈ వార్తలను భారత్ తీవ్ర ఆందోళనతో గమనించిందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. మైనారిటీ ప్రార్థనా స్థలంపై జరిగిన ఈ చర్యను భారత్ ఖండించిందని వెల్లడించారు.

ఆలయ కూల్చివేత మతపరమైన వారసత్వ పరిరక్షణలో పాకిస్థాన్ అధికారుల వైఫల్యాన్ని సూచిస్తోందని విదేశాంగ శాఖ పేర్కొంది. శతాబ్దం నాటి ఆలయాన్ని రక్షించడంలో అధికారుల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తోందని జైస్వాల్ అన్నారు. పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు, వారి మత స్వేచ్ఛ, ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న ఉల్లంఘనలను ఇటువంటి ఘటనలు మరోసారి గుర్తుచేస్తున్నాయని తెలిపారు.

కూల్చివేసిన ఆలయాన్ని పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ తక్షణ చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. మైనారిటీ పౌరుల భద్రత, రక్షణ, శ్రేయస్సుతో పాటు వారి మత, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యతను పాకిస్థాన్ ప్రభుత్వం నిర్వర్తించాలని స్పష్టం చేసింది.

స్థానికుల సమాచారం ప్రకారం.. నిషేధిత ఇస్లామిక్ సంస్థ ‘తహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్’ (టీఎల్‌పీ)కు చెందిన మతపరమైన తీవ్రవాదుల బృందం ఆలయ స్థలాన్ని పక్కనే ఉన్న మదర్సాలో విలీనం చేసేందుకు ఆలయాన్ని కూల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

ఆలయ కూల్చివేతకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆలయాన్ని పునర్నిర్మించాలని పాకిస్థాన్ మసీహా మిల్లత్ పార్టీ (పీఎంఎంపీ) పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. ఆగస్టు 28న పంజాబ్ అదనపు హోం సెక్రటరీని కలిసి, ఘటనకు బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు ఆలయాన్ని రక్షించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లు పార్టీ ఛైర్మన్ అస్లాం పర్వేజ్ సహోత్రా తెలిపారు.

కూల్చివేసిన ఆలయ శిఖరంలోని లోహపు నిర్మాణాలు, ఇతర సామగ్రి, ఇటుకలను కూడా అక్కడి నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ ఏర్పడిన సమయంలో నరోవాల్ జిల్లాలో సుమారు 45 హిందూ దేవాలయాలు ఉండేవని, కాలక్రమేణా వాటిలో చాలా శిథిలావస్థకు చేరుకున్నాయని స్థానికంగా చెబుతున్నారు.