News

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ముహూర్తం.. అక్టోబర్ 11 నుంచి 20 వరకు

23views

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 2026 దసరా నవరాత్రి మహోత్సవాల షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 11న ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి అక్టోబర్ 20న విజయదశమి వరకు పది రోజుల పాటు దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.

ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారు ఒక్కో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్‌ 11న దుర్గమ్మకు బాలా త్రిపురసుందరీదేవిగా అలంకరణ, 12న గాయత్రీదేవి, 13న అన్నపూర్ణదేవి, 14న మహాచండీదేవి, 15న లలితా త్రిపురసుందరీదేవి, 16న సరస్వతిదేవి అలంకరణ, 17న మహాలక్ష్మిదేవి, 18న దుర్గాదేవి, 18న మహిషాసురమర్ధినిగా అలంకరణ చేయనున్నారు. 20న రాజరాజేశ్వరిదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

హంసవాహనం తెప్పోత్సవంతో ముగింపు
విజయదశమి రోజున సాయంత్రం కృష్ణానదిలో నిర్వహించే హంసవాహనం తెప్పోత్సవం దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కన్నులపండువగా జరిగే ఈ తెప్పోత్సవంతో 2026 దసరా మహోత్సవాలు మంగళకరంగా ముగియనున్నాయి.

లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం
దసరా ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల దర్శనం, క్యూలైన్ల నిర్వహణ, లడ్డూ ప్రసాదాల విక్రయం, ఉచిత అన్నదానం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై దేవస్థానం అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దసరా నవరాత్రుల్లో అమ్మవారి వివిధ అలంకారాలను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.