News

ఇన్‌స్టా ఖాతా మిస్డ్‌కాల్‌ తో అరెస్టైన కిడ్నాపర్‌ షేక్‌ జాన్‌సైదా

31views

మూడు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న కిడ్నాపర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి చేసిన ఓ మిస్డ్‌కాల్‌ పట్టించింది. గుంటూరు నగరంలో పదో తరగతి చదువుతున్న బాలికను అపహరించిన షేక్‌ జాన్‌సైదా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడు మూడు నెలల పాటు పెద్దగా సెల్‌ఫోన్‌ కాల్స్‌ చేయకుండా మెసేజ్‌లకు ఇన్‌స్టా ఖాతాలను వాడటం.. తరచూ స్థావరాలు మారుస్తూ పోలీసులకు దొరక్కుండా సవాల్‌ విసిరాడు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా అతడి కదలికలు గుర్తించి, దర్యాప్తు బృందం అక్కడికి వెళ్లిసరికి తప్పించుకుని ఇతర ప్రాంతాలకు పారిపోతున్నాడు. చివరకు నిందితుడు, బాలిక హరియాణా రాష్ట్రం కర్నాల్‌ బుధాఖేరాలోని ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించి శుక్రవారం రాత్రి పట్టుకున్నారు.

మరోపక్క, బాలిక అదృశ్యంపై ఆమె తండ్రి ఇటీవల హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయగా.. హైకోర్టు ధర్మాసనం పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రాత్రి బాలిక ఇన్‌స్టా ఖాతా నుంచి మరోసారి తల్లిదండ్రులకు మిస్డ్‌కాల్‌ వచ్చింది. ఆ వెంటనే ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయింది. దాని ఆధారంగా పోలీసు ఐటీ విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది. జాన్‌సైదా పదేపదే ఇన్‌స్టా ఖాతాలు మారుస్తున్నా.. అతడి లోకేషన్‌ను గుర్తించారు. దాని ఆధారంగా శుక్రవారం ఉదయాన్నే పోలీసు బృందం హరియాణా వెళ్లి, స్థానిక పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి వారిని తీసుకుని గుంటూరుకు బయలుదేరారు. ఒక రోజు వ్యవధిలో జాన్‌సైదా రెండు ఇన్‌స్టా ఖాతాలు మార్చినట్లు గుర్తించారు. మొత్తంగా బాలిక మూడు, జాన్‌సైదా ఏడు చొప్పున ఇన్‌స్టా ఖాతాలు వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది.
వారం పాటు గుంటూరులోనే మకాం..

జాన్‌సైదా బాలికను పక్కా ప్రణాళిక ప్రకారం ట్రాప్‌ చేశాడు. జూన్‌ 9న బాలికను అతడు అపహరించగా.. అంతకుముందు వారం పాటు గుంటూరులోని మడతమంచాల లాడ్జిలో బసచేసి అన్నీ సమకూర్చుకున్నాడు. ఆన్‌లైన్‌లో ఓ సెకండ్‌ హ్యాండ్‌ ద్విచక్ర వాహనాన్ని చూసి కొన్నాడు. ఓ దుకాణదారు నుంచి సిమ్‌లు సమకూర్చుకున్నాడు. వాటితో వారం పాటు.. బాలిక ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు పంపిస్తూ ఆమెను ట్రాప్‌ చేశాడు. బాలిక ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఆ సెల్‌ఫోన్‌లోని మెసేజ్‌లన్నీ తొలగించి, దాన్ని మురుగు కాలువలో పడేసింది. బాలికను జాన్‌సైదా మొదట ద్విచక్ర వాహనంపై నెల్లూరు తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితుడైన మెకానిక్‌ వద్ద ఆశ్రయం పొందారు.

నెల్లూరులో దుస్తులు కొనుగోలు చేశారు. ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలేసి, ఆదోనిలో ఉన్న మరో స్నేహితుడికి దాన్ని తీసుకెళ్లాలని మెసేజ్‌ పంపాడు. తర్వాత చెన్నై, కోయంబత్తూరు, కేరళ వెళ్లి.. హైదరాబాద్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌లో బంధువు ఇంట్లో ఆశ్రయం పొందారు. నగరంలో నాలుగైదు దుకాణాల్లో బంగారం అమ్మడానికి ప్రయత్నించారు. నిందితుడికి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకరు, బంధువు ఒకరు సహకరించడంతో ఇన్నాళ్లూ తప్పించుకు తిరుగుతూ.. చివరికు హరియాణా చేరుకున్నారు. జాన్‌సైదాపై పర్చూరు స్టేషన్‌లో 2025లో ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసు కూడా ఉంది.