News

కిర్గిజిస్థాన్‌ ‘మానస్’ మహాకావ్యాన్ని వీక్షించిన ప్రధాన మోదీ.. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటి?

4views

న్యూఢిల్లీ: కిర్గిజిస్థాన్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశపు అద్భుతమైన సాంస్కృతిక సంప్రదాయం ప్రత్యక్షమైంది. రాజధాని బిష్కెక్‌లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రముఖ మనస్‌చీ (Manaschi) రిస్బై ఇసాకోవ్.. దాదాపు 5 లక్షల పంక్తులతో కూడిన ‘మానస్’ మహాకావ్యాన్ని శక్తివంతమైన స్వరంతో ఆలపించారు. ఈ ప్రత్యక్ష పఠనాన్ని ప్రధాని మోదీ వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

శతాబ్దాలుగా మౌఖిక సంప్రదాయంగా తరతరాలకు అందుతున్న ‘మానస్’.. కిర్గిజ్ ప్రజల చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత, సామూహిక గుర్తింపునకు ప్రతీకగా నిలిచింది. కిర్గిజ్ విద్యావేత్త గుల్జాత్ మాయాచినోవా మాట్లాడుతూ.. ‘మానస్’, ‘మహాభారతం’ రెండూ స్నేహం, సహనం వంటి ఉమ్మడి విలువలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. దీంతో భారత్, మధ్య ఆసియా దేశాల మధ్య ఉన్న ప్రాచీన సాంస్కృతిక సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది.

ఇంతకీ ‘మానస్’ అంటే ఏమిటి?
కిర్గిజ్ ప్రజల సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితంలో ‘మానస్‌’కు అత్యంత ప్రత్యేక స్థానం ఉంది. ఇది సాధారణంగా పుస్తకంగా చదివే కావ్యం కాదు. తరతరాలుగా ఒకరి నుంచి మరొకరికి మౌఖికంగా అందుతూ వచ్చిన విస్తారమైన ఇతిహాసం. శతాబ్దాల కాలంలో దీనికి అనేక రూపాలు, సంస్కరణలు ఏర్పడ్డాయి.

ప్రపంచంలోని అతిపెద్ద ఇతిహాసాల్లో ఒకటిగా ‘మానస్’కు గుర్తింపు ఉంది. మానస్ అనే వీరుడి జీవితమే ఈ మహాకావ్యానికి ప్రధాన ఇతివృత్తం. తన ప్రజలను, భూమిని రక్షిస్తూ గొప్ప యోధుడిగా ఎదిగిన మానస్.. పరస్పరం విభేదించే కిర్గిజ్ తెగలను ఉమ్మడి శత్రువులపై ఏకం చేస్తాడు.

అయితే ‘మానస్’ కేవలం యుద్ధాలు, విజయాల కథ మాత్రమే కాదు. ఇందులో స్నేహాలు, పొత్తులు, విందులు, వివాహాలు, ద్రోహాలు, వలసలు, నాయకత్వం, విధేయత, గౌరవం వంటి అనేక అంశాలు కనిపిస్తాయి. కిర్గిజ్ ప్రజల జీవన విధానం, ఆచారాలు, నైతిక విలువలు, మత విశ్వాసాలు, వైద్యం, భౌగోళిక పరిజ్ఞానం వంటి అంశాలకు కూడా ఇందులో స్థానం ఉంది.

మానస్‌ కథ అక్కడితో ముగియదు..
ఈ మహాకావ్యంలోని మరో విశేషం ఏమిటంటే.. మానస్ మరణంతో కథ ముగియదు. ఆయన తర్వాత కథ కుమారుడు సెమెటెయ్‌ చుట్టూ, అనంతరం మనవడు సెయ్‌టెక్‌ చుట్టూ కొనసాగుతుంది. మానస్, సెమెటెయ్, సెయ్‌టెక్ కథలను కలిపి సాధారణంగా ‘మానస్-సెమెటెయ్-సెయ్‌టెక్ త్రయం’గా పేర్కొంటారు. దీంతో ఒక వీరుడి జీవితగాథగా ప్రారంభమైన కథ.. తరతరాలుగా కొనసాగే భారీ ఇతిహాసంగా రూపుదిద్దుకుంది.

మనస్‌చీలే ఈ మహాకావ్యానికి ప్రాణం
‘మానస్’ ఇప్పటికీ సజీవంగా ఉండటానికి ప్రధాన కారణం మనస్‌చీలు. వీరు ఈ విస్తారమైన ఇతిహాసంలోని అనేక భాగాలను కంఠస్థం చేసుకుని ప్రేక్షకుల ముందు గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి ప్రదర్శిస్తారు. పూర్తి ఇతిహాసాన్ని వినిపించడానికి దాదాపు మూడు రోజుల సమయం పట్టవచ్చని చెబుతారు.

మనస్‌చీలకు అసాధారణ జ్ఞాపకశక్తితో పాటు కవితా ప్రతిభ, లయపై పట్టు ఉంటుంది. కథలోని పాత్రలు, సంఘటనలు, భావోద్వేగాలను స్వరం, హావభావాలు, అనుకరణల ద్వారా ప్రేక్షకుల ముందు సజీవంగా ఆవిష్కరిస్తారు. ఒక్కో మనస్‌చీ తనదైన శైలిలో కథను చెప్పడంతో ‘మానస్’ ఒకే రూపంలో స్థిరపడిన గ్రంథంగా కాకుండా నిరంతరం పరిణామం చెందే జీవంతమైన సాహిత్య సంప్రదాయంగా కొనసాగుతోంది.

ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలూ ఉన్నాయి
‘మానస్’లో మానవ జీవితానికి సంబంధించిన అంశాలతో పాటు ఆధ్యాత్మిక, పౌరాణిక కోణాలు కూడా కనిపిస్తాయి. అతీంద్రియ ఘటనలు, మత విశ్వాసాలు, ప్రవచనాలు, కలలు, పురాతన మధ్య ఆసియా సంప్రదాయాలు ఇందులో చోటు చేసుకున్నాయి.

అయితే మానస్‌కు ఉన్న అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యం దాని సాంస్కృతిక విలువలోనే ఉంది. శతాబ్దాలుగా కిర్గిజ్ ప్రజల చరిత్ర, జ్ఞాపకాలు, సంప్రదాయాలు, సామూహిక గుర్తింపును భద్రపరిచిన సాంస్కృతిక భాండాగారంగా ఇది నిలిచింది.

‘మానస్‌’కు ‘మహాభారతం’తో పోలిక ఎందుకు?
భారత్‌లో ‘మానస్‌’పై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో.. దీనిని ‘మహాభారతం’తో పోల్చి చూడటం కూడా ఆసక్తికరంగా మారింది. భౌగోళికంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. రెండు ఇతిహాసాల్లోనూ నాయకత్వం, కుటుంబం, విధేయత, గౌరవం, ధర్మం, స్నేహం వంటి మానవ విలువలకు ప్రాధాన్యం కనిపిస్తుంది.

ముఖ్యంగా తరతరాలుగా కథలను జ్ఞాపకం, మౌఖిక ప్రదర్శనల ద్వారా సజీవంగా ఉంచిన సంప్రదాయం రెండింటిలోనూ కనిపించే ఆసక్తికరమైన సారూప్యత. అయితే ‘మానస్’, ‘మహాభారతం’ వేర్వేరు చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాల్లో రూపుదిద్దుకున్న ప్రత్యేక ఇతిహాస సంప్రదాయాలు.

ప్రధాని మోదీ కిర్గిజిస్థాన్‌ పర్యటనలో ‘మానస్’ ప్రత్యక్ష ప్రదర్శనకు ప్రాధాన్యం లభించడం భారత్‌, కిర్గిజిస్థాన్‌ మధ్య పెరుగుతున్న సాంస్కృతిక అనుబంధానికి మరో ఉదాహరణగా నిలిచింది. భిన్న భౌగోళిక ప్రాంతాల్లో పుట్టిన ఇతిహాసాలు కూడా మానవ విలువలు, సామూహిక జ్ఞాపకాలు, సాంస్కృతిక గుర్తింపును ఎంత బలంగా ప్రతిబింబిస్తాయో ‘మానస్’ మరోసారి ప్రపంచానికి గుర్తుచేస్తోంది.