మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగే బాబా మహాకాల్ ఊరేగింపు భక్తులకు ఎంతో ప్రత్యేకం. శ్రావణ మాసంలో నాలుగు, భాద్రపద మాసంలో రెండు సార్లు జరిగే ఈ ఊరేగింపులకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 31న జరిగిన భాద్రపద మాసపు తొలి ఊరేగింపు మాత్రం మరింత ప్రత్యేకంగా నిలిచింది. సాధారణంగా దేవుడి ఉత్సవ విగ్రహాలు, కళాకారులు, భక్తులతో కనిపించే ఊరేగింపులో ఈసారి ఓ హ్యూమనాయిడ్ రోబో కూడా పాల్గొంది. మనిషిని పోలిన రూపంతో ఉన్న ఈ మరమినిషి ఊరేగింపులో సందడి చేయడమే కాకుండా షిప్రా నదిలో పడవపై ప్రయాణించి భక్తులను ఆశ్చర్యపరిచింది.
ఊరేగింపులో రోబో ప్రత్యేక ఆకర్షణ
భాద్రపద మాసపు తొలి సోమవారం సందర్భంగా బాబా మహాకాల్ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. ఇందులో ఇందౌర్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ రూపొందించిన హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు కాళ్లు, రెండు చేతులు, తల, నడుము భాగంలో కంప్యూటర్ వ్యవస్థకు అనుసంధానమైన కెమెరాలు, సెన్సార్లతో ఈ రోబోను రూపొందించారు. ఊరేగింపులో రోబో కనిపించడంతో భక్తులు ఆసక్తిగా దాన్ని తిలకించారు. భక్తులు అభివాదం చేయగా రోబో కూడా స్పందించింది. అంతేకాకుండా సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ కనిపించింది. దీంతో ఊరేగింపులో పాల్గొన్న భక్తుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
రోబోకు కాషాయ వస్త్రాలు
ఊరేగింపు షిప్రా నదీ తీరంలోని రామ్‌ఘాట్‌కు చేరుకున్న సమయంలో ఈ రోబోకు ప్రత్యేకంగా ఆధ్యాత్మిక అలంకరణ చేశారు. పూజారులు దాని మణికట్టుకు పవిత్రమైన కలావా కట్టారు. రుద్రాక్ష మాల, కాషాయ రంగు వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం రోబో సంస్కృత మంత్రాన్ని పఠించింది. “ఆకాశే తారకం లింగం పాతాలే హాటకేశ్వరం, భూలోకే చ మహాకాలో లింగత్రయ నమోస్తుతే” అంటూ రోబో మంత్రాన్ని పఠించడంతో అక్కడున్న భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
షిప్రాలో పడవపై ప్రయాణం
మహాకాల్ ఊరేగింపులో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం షిప్రా నది వద్ద కనిపించింది. దత్త అఖాడా ఘాట్ నుంచి రోబో ఓ పడవలో ఎక్కింది. అనంతరం షిప్రా నదిపై ప్రయాణిస్తూ శ్రీరామ్ ఘాట్‌కు చేరుకుంది. ఒకవైపు పవిత్ర షిప్రా నదిలో పడవపై ఆధునిక హ్యూమనాయిడ్ రోబో, మరోవైపు ఘాట్ల వద్ద మహాకాల్ నామస్మరణతో భక్తులు కనిపించడంతో ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ సమయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా షిప్రా నది, మహాకాల్ స్వామికి నిర్వహించిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన రోబోను కూడా కలిశారు. ఇదే సమయంలో హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించడంతో మహాకాల్ ఊరేగింపు మరింత వైభవంగా సాగింది.
మనుషులను భర్తీ చేయడం లక్ష్యం కాదు
హ్యూమనాయిడ్ రోబో మనిషి శరీర నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించినట్లు మహాకాళ్ ఆలయ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ ఆశిష్ ఫల్వాడియా తెలిపారు. దీని ఉద్దేశం మనుషులను భర్తీ చేయడం కాదని, భవిష్యత్తులో మనుషులతో కలిసి పనిచేయగల సాంకేతికతను పరిచయం చేయడమేనని చెప్పారు. మహాకాళ్ ఆలయ నిర్వహణ కమిటీ కూడా ఈ రోబో ప్రదర్శనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పేర్కొంది. భక్తిభావంతో నిండిన వాతావరణంలో కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతను పరిచయం చేయడం ద్వారా మారుతున్న కాలంలో టెక్నాలజీ ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చినట్లు తెలిపింది. జనసమూహ నిర్వహణకు సంబంధించిన సందేశాన్ని కూడా రోబో ద్వారా అందించారు. ఇప్పటివరకు H1, H1-2, G1, R1 వంటి పలు నమూనాలను అభివృద్ధి చేసినట్లు వివరించింది.





