
తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన, ప్రశాంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, అన్నప్రసాదం, భద్రత తదితర సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తోంది.
సర్వదర్శనం, నిర్దేశిత సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వర్చువల్ సేవలు, ఎన్ఆర్ఐలు తదితర ప్రత్యేక దర్శనాలకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలపై భక్తులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తోంది.
ఇటీవలి కాలంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ సమన్వయంతో ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాలు వంటి విశేష పర్వదినాల్లో భారీగా తరలివచ్చే భక్తుల కోసం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతోంది.
స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ నుంచి కేటాయించిన సమయానికి దర్శనం కల్పించే వరకు వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. రద్దీ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణతో పాటు తాగునీరు, అన్నప్రసాదం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
శ్రీవారి దర్శనం, వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తామని భక్తులను మోసం చేసే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ ఏడాది ఇప్పటివరకు దర్శనం, గదుల కేటాయింపు పేరుతో మోసాలకు పాల్పడిన దళారులపై 30 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. అలాగే ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన 43 మంది ఉద్యోగులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.దళారులైనా, సిబ్బందైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రాజీలేకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది.
టీటీడీ పేరుతో నకిలీ వెబ్సైట్లు ఏర్పాటు చేసి గదుల కేటాయింపు పేరుతో భక్తులను మోసం చేస్తున్న వ్యవహారంపైనా అధికారులు దృష్టి సారించారు.ఈ ఏడాది ఇప్పటివరకు 249 నకిలీ వెబ్సైట్లను గుర్తించినట్లు టీటీడీ తెలిపింది. వీటిపై రెండు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సంబంధిత సంస్థల సహకారంతో ఆ వెబ్సైట్లను తొలగించినట్లు పేర్కొంది. ఆన్లైన్లో టీటీడీ పేరుతో కనిపించే అనధికారిక వెబ్సైట్లు, అనుమానాస్పద లింక్‌లను నమ్మి డబ్బులు చెల్లించవద్దని భక్తులకు సూచించింది.
తిరుమల క్షేత్రంలో భద్రత, గోప్యతను దృష్టిలో ఉంచుకుని డ్రోన్లు, రికార్డింగ్ సామర్థ్యం ఉన్న స్మార్ట్ గ్లాసెస్ వంటి పరికరాలపై టీటీడీ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.అలిపిరి, శ్రీవారిమెట్టు తనిఖీ కేంద్రాల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఇప్పటివరకు అలిపిరి వద్ద 261 డ్రోన్లు, 105 మెటా స్మార్ట్ గ్లాసెస్ గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. పవిత్ర తిరుమల క్షేత్రంలో నిషేధిత రికార్డింగ్ పరికరాలను తీసుకురావద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.
శ్రీవారి దర్శనం, వసతి, సేవలు, టోకెన్ల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ సూచించింది. సేవలు, నిబంధనలు, మార్గదర్శకాలకు సంబంధించి అధికారిక టీటీడీ సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది.భక్తులను అప్రమత్తం చేసేందుకు టీటీడీ సామాజిక మాధ్యమాలు, ఎస్వీబీసీ, ప్రజా సంబంధాల విభాగాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.నిబంధనలు పాటించి ప్రశాంతంగా దర్శనం చేసుకోండి
తిరుమలకు వచ్చే భక్తులు టీటీడీ సూచనలు, నిబంధనలు పాటిస్తూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు. దళారులను ఆశ్రయించకుండా అధికారిక మార్గాల్లోనే దర్శనం, వసతి, సేవలను పొందాలని సూచించారు.
భక్తిశ్రద్ధలతో తిరుమలకు చేరుకుని.. నిబంధనలను పాటిస్తూ ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.





