News

లండన్ పర్యటనలో మోహన్ భగవత్ : ఖాల్సా జథా గురుద్వారా, స్వామినారాయణ్ ఆలయాల సందర్శన

5views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విదేశీ పర్యటనలో ఉన్న సరసంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ లండన్ చేరుకున్నారు. అమెరికా, కెనడా పర్యటనలను ముగించుకుని సెప్టెంబరు 2న లండన్ వచ్చిన ఆయన, అక్కడ పలు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

పర్యటనలో భాగంగా మోహన్ భగవత్ ప్రసిద్ధ ఖాల్సా జథా బ్రిటిష్ ఐల్స్ గురుద్వారాను సందర్శించి ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా సిక్కు సమాజ ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం విల్స్‌డెన్‌లోని ప్రసిద్ధ శ్రీ స్వామినారాయణ్ ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు ఆలయ పాలకమండలి సభ్యులు, సన్యాసులు, స్థానిక ప్రవాస భారతీయులు సాంప్రదాయబద్ధంగా సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీ స్వామినారాయణ్ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విశ్వశాంతి, సమృద్ధి కోసం ప్రార్థించారు.

అక్కడ ఉన్న హిందూ సమాజ ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే క్రమంలో ఆయన లండన్‌లోని ఒక జైన ఆలయాన్ని కూడా దర్శించనున్నారు.

ఈ పర్యటనను యూకేకి చెందిన ‘ఇంటిగ్రల్’ సంస్థ సమన్వయం చేస్తుండగా, 115కి పైగా సామాజిక-సాంస్కృతిక సంస్థలు మద్దతు తెలిపాయి. సెప్టెంబరు 6న హిందూ స్వయంసేవక్ సంఘ్ (HSS UK) ఆధ్వర్యంలో 310కి పైగా భారతీయ సంస్థల భాగస్వామ్యంతో “సెలబ్రేషన్ ఆఫ్ వన్‌నెస్” (Celebration of Oneness) పేరిట నిర్వహించనున్న విశేష సమారోహంలో మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించనున్నారు.