News

జగన్నాథునికి 60,821 ఎకరాలు

3views

పూరీ: ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయానికి ఉన్న ఆస్తుల వివరాలను శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (ఎస్‌జేటీఏ) వెల్లడించింది. ఆలయానికి పలు బ్యాంకుల్లో కలిపి సుమారు రూ.1,912 కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నట్లు ఎస్‌జేటీఏ తెలిపింది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో కలిపి 60,821 ఎకరాల భూమి ఆలయం పేరుతో ఉన్నట్లు వెల్లడించింది.

ఆలయానికి ఉన్న ఆస్తుల్లో రత్న భండార్‌లో భద్రపరిచిన బంగారు, వజ్రాభరణాలు కూడా ఉన్నాయి. వీటికి అదనంగా భక్తులు సమర్పించే విరాళాలు, ఆలయానికి చెందిన క్వారీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు, భూముల క్రయవిక్రయాల ద్వారా వచ్చే ఆదాయం, ప్రభుత్వం అందించే గ్రాంట్లు ఆలయ ఆదాయానికి ప్రధాన వనరులుగా ఉన్నట్లు శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన ముఖ్య నిర్వాహకుడు అరబింద కుమార్ పాధీ ఒక ప్రకటనలో తెలిపారు.

భక్తులు ఆన్‌లైన్‌లో విరాళాలు సమర్పించేందుకు ‘సమర్పణ్’ పేరుతో డిజిటల్ డొనేషన్ ప్లాట్‌ఫాంను కూడా ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 31 నాటికి ఈ డిజిటల్ వేదిక ద్వారా రూ.56.71 లక్షల విరాళాలు అందినట్లు తెలిపారు.

ఆలయం పేరుతో ఉన్న మొత్తం భూమిలో 60,426 ఎకరాలు ఒడిశాలోని 24 జిల్లాల్లో విస్తరించి ఉన్నట్లు ఎస్‌జేటీఏ వివరించింది. మిగిలిన 395 ఎకరాల భూమి పశ్చిమ బెంగాల్‌తో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో ఉన్నట్లు పేర్కొంది.

పూరీ జగన్నాథ ఆలయానికి శతాబ్దాలుగా భక్తుల నుంచి విరాళాలు, భూముల రూపంలో సమకూరిన ఆస్తులు ఉన్నాయి. ఆలయ పరిపాలన వాటిని నిర్వహిస్తూ, స్వామివారి నిత్య సేవలు, పూజలు, ఉత్సవాలు, ఆలయ నిర్వహణకు వినియోగిస్తోంది.

జగన్నాథ ఆలయానికి సంబంధించిన రత్న భండార్‌లోని ఆభరణాలు, భూములు, బ్యాంకు డిపాజిట్ల వివరాలు మరోసారి వెలుగులోకి రావడంతో స్వామివారి ఆలయ సంపదపై ఆసక్తి నెలకొంది.