News

శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేక అవకాశం

4views

శ్రీశైలం: శ్రావణ మాసం నాలుగో శుక్రవారం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో చంద్రవతి కల్యాణ మండపంలో భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాలను నిర్వహించారు. దేవస్థానం ఉచితంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 1,700 మందికి పైగా భక్తులు పాల్గొని వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించారు.

ఈ సందర్భంగా నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు చెందిన 1,233 మంది చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే అవకాశం కల్పించారు. మరో 500 మందికి పైగా ఇతర భక్తులు కూడా సామూహిక వ్రతాన్ని ఆచరించారు.

శాస్త్రోక్తంగా వరలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు
భక్తుల కోసం శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో అవసరమైన పూజా సామగ్రిని సమకూర్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు, వ్రత విధానాలను నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని కొలిచి, కుటుంబ సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని ప్రార్థించారు.

వ్రతం అనంతరం భక్తులకు శ్రీశైల మల్లికార్జున స్వామివారి, భ్రమరాంబాదేవి అమ్మవారి దర్శన సౌకర్యం కల్పించారు. అన్నప్రసాదాలను కూడా అందించారు. అదేవిధంగా భక్తులకు పూలు, గాజులు, కంకణాలు, తులసి మొక్క, శ్రీశైలప్రభ మాసపత్రిక, ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలను అందజేశారు.

చెంచు గిరిజనులకు శ్రీశైలంతో ప్రత్యేక అనుబంధం
శ్రీశైలం మహాక్షేత్రంతో చెంచు గిరిజనులకు అనాదిగా ప్రత్యేక అనుబంధం ఉందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి తెలిపారు. చెంచు గిరిజనులు శ్రీ మల్లికార్జున స్వామివారిని తమ అల్లుడిగా, భ్రమరాంబాదేవిని తమ కూతురిగా భావిస్తూ ఆత్మీయ భక్తి సంబంధాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

చెంచు గిరిజనుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలకు శ్రీశైలం క్షేత్రంతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. శ్రావణ మాసంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపాయి.