
హల్ద్వానీ: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమానికి కులం రంగు పులిమి రాజకీయ ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీరాం సేన ధర్మరథ్ సేవా న్యాస్ సభ్యుడు, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అమిత్ కుమార్ ఈ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో ఈ నెల 8న నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. అనంతరం ఈ నెల 11న ఆ ప్రదేశాన్ని కొందరు శుద్ధి చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక దళితుడు సభకు హాజరైనందుకే స్థలాన్ని శుద్ధి చేశారని పేర్కొంటూ.. ఈ ఘటన బీజేపీకి ఉన్న దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు.
అయితే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు వాస్తవాలను వక్రీకరించేవిగా ఉన్నాయని అమిత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 11న రామ్‌లీలా మైదానంలో మతపరమైన శుద్ధి యజ్ఞం నిర్వహించిన మాట వాస్తవమేనని, అయితే అది ఏ ఒక్క కులానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఆ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు హాజరయ్యారని అమిత్ కుమార్ తెలిపారు. కుల వివక్షకు సంబంధించిన అంశాన్ని లేని చోట ఆపాదిస్తూ రాహుల్ గాంధీ రాజకీయ విమర్శలు చేశారని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని అమిత్ కుమార్ పోలీసులను కోరారు. అయితే ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని స్థానిక పోలీసు అధికారి ఆదివారం తెలిపారు. ఫిర్యాదును జిల్లా సీనియర్ ఎస్పీతో పాటు జాతీయ ఎస్సీ కమిషన్‌కు పంపించినట్లు వెల్లడించారు.
ఓ మతపరమైన కార్యక్రమాన్ని రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవడమే కాకుండా, వాస్తవాలను నిర్ధారించకుండానే కుల వివక్ష ఆరోపణలు చేయడం సరికాదని ఫిర్యాదుదారు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు, జాతీయ ఎస్సీ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.





