
సమాజ సేవ, క్రమశిక్షణ, దేశభక్తి వంటి విలువలను ప్రోత్సహించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పథసంచలనంలో పాల్గొన్న ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులపై కర్ణాటక విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. తాము పాల్గొన్నది రాజకీయ కార్యక్రమం కాదని, సాంస్కృతిక కార్యక్రమమని ఉపాధ్యాయులు స్పష్టం చేసినప్పటికీ శాఖ వారి వివరణను తిరస్కరించింది.
యాద్గిర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చెన్నబసప్ప ముధోల్ ఆగస్టు 20న సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. హునసగి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల అసిస్టెంట్ టీచర్ గురురాజ్ జోషి, సుర్‌పూర్ తాలూకా కుప్పి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అన్నా సాహెబ్ దేశ్‌ముఖ్‌పై ఈ చర్యలు తీసుకున్నారు.
గురురాజ్ జోషి 2025 అక్టోబర్ 12న విజయపుర జిల్లాలోని తాళికోటలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ పథసంచలనంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రచురితమైన అనంతరం ఆయనపై ఫిర్యాదు వచ్చింది. 2026 మార్చి 13న జారీ చేసిన షోకాజ్ నోటీసుకు జోషి సమాధానమిస్తూ.. పథసంచలనం ఆదివారం జరిగిందని, తన విధి సమయం ముగిసిన తర్వాతే అందులో పాల్గొన్నానని తెలిపారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదని, సాంస్కృతిక కార్యక్రమమని వివరించారు. అయితే విద్యాశాఖ ఆయన వాదనను అంగీకరించలేదు.
ఆర్‌ఎస్‌ఎస్ పథసంచలనం.. రాజకీయమా, సాంస్కృతిక కార్యక్రమమా?
అన్నా సాహెబ్ దేశ్‌ముఖ్ విషయంలోనూ దాదాపు ఇదే పరిణామం చోటుచేసుకుంది. 2025 అక్టోబర్ 10న హునసగిలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ పథసంచలనంలో ఆయన పాల్గొన్నారు. తాను విధి నిర్వహణ సమయం వెలుపలే కార్యక్రమానికి హాజరయ్యానని, అది సాంస్కృతిక కార్యక్రమమని ఆయన కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ శాఖ ఈ వివరణను తిరస్కరించి సస్పెన్షన్ విధించింది.
ప్రభుత్వ ఉద్యోగి అంటే సామాజిక జీవితానికి దూరం కావాలా?
ఈ ఘటన నేపథ్యంలో ఒక ప్రశ్న ముందుకొస్తోంది: ప్రభుత్వ ఉద్యోగి తన విధులకు భంగం కలగకుండా, సెలవు రోజున లేదా విధి సమయం వెలుపల ఒక సామాజిక–సాంస్కృతిక సంస్థ కార్యక్రమంలో పాల్గొంటే దానిని రాజకీయ కార్యకలాపంగా పరిగణించాలా?
ఇదే అంశం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శంగా ఉండాలన్నది ఎంత ముఖ్యమో, వారు తమ వ్యక్తిగత సమయం మరియు సామాజిక జీవితంలో చట్టబద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొనే స్వేచ్ఛపై కూడా స్పష్టత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.





