ArticlesNews

సైన్యంలో సిపాయి నుంచి హాకీ మాంత్రికుడి వరకూ స్ఫూర్తిదాయక ప్రస్థానం

2views

(ఆగస్టు 29 – మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి: జాతీయ క్రీడా దినోత్సవం)

ఆర్మీ బ్యారక్స్‌లో డ్రిల్ సెషన్లు, వెన్నెల రాత్రుల్లో అభ్యాసాలు, న్యూజీలాండ్ పర్యటనలో వందకు పైగా గోల్స్… నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక బాలుడు మొదట సిపాయి ఎలా అయ్యాడు, అక్కడినుంచీ భారతదేశపు క్రీడా చరిత్రలోనే అత్యుత్తమ తారగా ఎలా ఎదిగాడు? మేజర్ ధ్యాన్‌చంద్ చరిత్ర ఆద్యంతమూ స్ఫూర్తిదాయకమే.

ధ్యాన్‌చంద్ అసలు పేరు ధ్యాన్‌సింగ్. అతను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో 1905 ఆగస్టు 29న ఓ పేద కుటుంబంలో పుట్టాడు. 17ఏళ్ళ వయసులో ఉద్యోగం కోసం వెతుక్కుంటూ భారత సైన్యంలో చేరాడు. అతని తండ్రి కూడా ఆర్మీలోనే పనిచేసేవారు. అందువల్ల ధ్యాన్‌సింగ్‌కు చిన్నతనం నుంచే దేశం, క్రమశిక్షణ, బాధ్యతల గురించి తెలుసు. నిజానికి ధ్యాన్‌సింగ్‌ క్రీడల్లో రాణించడం కోసం కాక, తన కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోడానికి సైన్యంలో చేరారు. ఆ సాధారణ సిపాయి భారత క్రీడా చరిత్రలోనే ప్రకాశవంతమైన తారగా నిలుస్తాడని ఎవరూ ఊహించలేదు.

బ్యారక్స్‌లో జీవితం, మొదటిసారి ఆడే అవకాశం:
ఆర్మీ బ్యారక్స్‌లో జీవితం చాలా కఠినంగా, నియమబద్ధంగా ఉంటుంది. ఉదయం పెరేడ్‌లు, గంటల తరబడి డ్రిల్‌లు, లాంగ్‌మార్చ్‌లు అనుదిన కార్యక్రమాలు అయిపోయాయి. సైన్యంలో క్రీడలు అభిరుచి కాదు, తప్పక ఆచరించవలసిన విధి. అయితే మైదానంలో హాకీ స్టిక్ పట్టుకుంటే చాలు ధ్యాన్‌సింగ్‌లో సంతోషం వెల్లివిరిసేది. సరైన పిచ్ లేదు, శిక్షణ ఇచ్చేవారు లేరు, రోజంతా కష్టపడిన తర్వాత సాయంత్రం అలసటగా ఉండేది, అయినా అతడు అభ్యాసం చేస్తూనే ఉండేవాడు. ఝాన్సీ కంటోన్మెంట్‌లోని కఠినమైన గ్రౌండ్స్‌, శిథిలావస్థలో ఉన్న స్టిక్, ఒక హాకీ బాల్… అవే అతని గురువులు.

వెన్నెల రాత్రుల్లో అభ్యాసాలు, చంద్ అనే ముద్దుపేరు:
రోజంతా శ్రమించి అలసిపోయాక, బ్యారక్స్‌లో అందరూ నిద్రపోయాక ధ్యాన్‌సింగ్‌ ఒంటరిగా మైదానంలోకి చేరుకుని రాత్రిపూట చంద్రుడి వెన్నెల వెలుగులో హాకీ అభ్యసించేవాడు. ఆ అలవాటుని చూసి అతని సహచర సైనికులు అతన్ని చంద్ అని పిలిచేవారు. క్రమంగా అతనిపేరు ధ్యాన్‌సింగ్ కాస్తా ధ్యాన్‌చంద్ అయిపోయింది. సైన్యంలో కఠినమైన రైఫిల్ డ్రిల్స్, మైళ్ళ తరబడి పరుగులు, భౌతిక క్రమశిక్షణ అతని శరీరాన్ని బలోపేతం చేసాయి, మనసుని స్థిరపరిచాయి. ఆ కఠినమైన శిక్షణే తర్వాతి కాలంలో ఆటలో అతని డ్రిబ్లింగ్, బంతిని నియంత్రించడం, చురుగ్గా కదలడానికి పునాదిగా నిలిచింది.

ఆట, క్రమశిక్షణల మేలు కలయిక:
1922 నుంచి 1926 వరకూ నాలుగేళ్ళ పాటు ధ్యాన్‌చంద్ కేవలం రెజిమెంటల్ స్థాయిలో, ఆర్మీ అంతర్గత క్రీడల్లోనూ మాత్రమే పాల్గొన్నాడు. బైటి గుర్తింపు, ప్రత్యేక సౌకర్యాలూ ఏమీ లేవు. కానీ ప్రతీ మ్యాచ్‌లోనూ అతని ప్రతిభ వెలుగు చూసేది. ఆ సిపాయి క్రీడామైదానంలో అసాధారణంగా రాణిస్తున్న సంగతిని అతని సీనియరర్ అధికారులు గ్రహించారు. దాంతో హాకీపై పూర్తి ధ్యాస పెట్టడానికి ఆర్మీ అతనికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అక్కడినుంచీ అతని క్రమశిక్షణ, నైపుణ్యం కలిసి అడుగులు వేయసాగాయి. క్రమంగా ధ్యాన్‌చంద్ తన సహచరులకు స్ఫూర్తిగా మారాడు.

తలుపు తట్టిన అవకాశం – ఆర్మీ హాకీ జట్టులో స్థానం:
1926లో భారత సైన్యంలోని హాకీ టీమ్ న్యూజీలాండ్‌లో ఒక ముఖ్యమైన పర్యటనకు సిద్ధమవుతోంది. జట్టు సభ్యుల ఎంపికకు కచ్చితమైన నిబంధనలు ఉంటాయి. సాధారణంగా అధికారులకే జట్టులో చోటు దక్కుతుంది. కానీ నిరంతర అభ్యాసం, బంతి మీద అసాధారణమైన నియంత్రణ, మెరుపువేగంతో కదిలే ఫుట్‌వర్క్ కారణంగా ధ్యాన్‌చంద్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. భారతదేశపు జట్టుకు విదేశీ గడ్డ మీద ప్రాతినిధ్యం వహించడం సామాన్యమైన సిపాయికి కలలాంటి అవకాశం. ఆ అవకాశం ధ్యాన్‌చంద్‌కు దక్కింది.

న్యూజీలాండ్ పర్యటన – సుసాధ్యమైన అసాధ్యం:
ధ్యాన్‌చంద్ న్యూజీలాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఆ నిర్ణయం భారత హాకీ చరిత్ర గతినే మార్చేసింది. 21 మ్యాచ్‌ల సీరీస్‌లో భారత ఆర్మీ జట్టు 18 మ్యాచ్‌లు గెలిచింది. ధ్యాన్‌చంద్ ఒక్కడే వందకు పైగా గోల్స్ చేసాడు. అతని ధైర్యం, నైపుణ్యం అధికారులను ఎంతగా ముగ్ధుల్ని చేసాయంటే, జట్టు కెప్టెన్ గాయపడినప్పుడు అతన్నే కెప్టెన్‌గా చేసారు. నిజానికి ఆర్మీలోని కఠినమైన నియమాల ప్రకారం సిపాయి ఎప్పుడూ నాయకుడు కాలేడు. ఆ నియమాన్ని కూడా అధికారులు పక్కకు పెట్టేసారు.

ఒక వ్యక్తిని నిర్వచించగలిగేది అతని అధికార స్థాయి కాదు, అతని నైపుణ్యం మాత్రమే అని నిరూపించిన అద్భుత సందర్భం అది. అక్కడినుంచీ ఆ మేధావి ప్రపంచం దృష్టిలో పడ్డాడు. అనంతర కాలంలో అదే ధ్యాన్‌చంద్ మూడు ఒలింపిక్ స్వర్ణపతకాలు గెలిచి, చరిత్రలో తన పేరును శిలాక్షరాలతో చెక్కించుకున్నాడు. ‘‘హాకీ మాంత్రికుడు’’ అనే కీర్తి గడించాడు.

హిట్లర్ అభినందన, ఆహ్వానం:
1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో ధ్యాన్‌చంద్ నేతృత్వంలోని భారత హాకీ జట్టు బంగారు పతకం గెలుచుకుంది. ఆ టోర్నమెంట్‌లో అతను 14 గోల్స్ చేసాడు. వాటిలో 8 గోల్స్, జర్మనీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సాధించాడు. ఆ మ్యాచ్ తర్వాత హిట్లర్ భారత జట్టును కలిసి వారిని అభినందించాడు. ధ్యాన్‌చంద్‌పై ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించాడు. జర్మన్ సైన్యంలో చేరాలంటూ ఆహ్వానించాడు. కానీ ధ్యాన్‌చంద్ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాడు.
ధ్యాన్‌చంద్ ప్రఖర దేశభక్తుడు. భారత్ తప్ప మరే దేశం తరఫునా హాకీ ఆడడానికి నిరాకరించాడు. అంతేకాదు, అతను అహింసపై పూర్తి నమ్మకం ఉన్న వ్యక్తి. అందుకే నాజీ హిట్లర్‌తో కలిసి నడవకూడదని భావించి ఉంటాడు.

దేశానికి క్రీడాస్ఫూర్తి:
‘హాకీ మాంత్రికుడు’ మేజర్ ధ్యాన్‌చంద్ గాధ దేశంలోని క్రీడాకారులు అందరికీ స్ఫూర్తిదాయకమైనది. అందుకే ఆయన జయంతి అయిన ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా 2012 నుంచీ నిర్వహిస్తున్నారు. అలాగే, 1991-92లో ప్రారంభించిన రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పేరును 2021 నుంచీ మేజర్‌ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మార్చారు. క్రీడ ఏదైనా, పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన ధ్యాన్‌చంద్‌…. యావద్దేశానికీ స్ఫూర్తి ప్రదాత.