
జాతీయ వాదానికి సంస్కృతమే ఊతమని రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి.విల్సన్ @ శరత్ చంద్ర అన్నారు. ఐదు వందల గ్రామాలను సంస్కృత గ్రామాలుగా తీర్చిదిద్దుటకు చర్యలు చేపట్టామని చెప్పారు. గుంటూరులో శారదా నికేతన్ ఓరియంటల్ కళాశాలలో కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ సౌజన్యంతో తెలుగు మరియు సంస్కృత అకాడమీ సంస్కృత సప్తాహం వారోత్సవాలలో భాగంగా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతం అమృత భాష అన్నారు. సంస్కృతం పండితుల భాషగా ప్రజల్లో నానుడి ఉందని దాన్ని చెరిపివేసి సామాన్యులకు సంస్కృత భాష చేర్చే కార్యాచరణ అకాడమీ చేపడుతుందని చెప్పారు. “అందరికీ సంస్కృతం – అందరిలోకి సంస్కృతం” శీర్షికన ముందుకు వెళుతున్నామని చెప్పారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం సౌజన్యంతో అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో రూ.5 వందల కోట్లతో నిర్మించుటకు ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు అనుబంధంగా 100 పడకల ఆయుర్వేద వైద్యశాల రానుందన్నారు. బహుళ ప్రయోజనాలు సమకూర్చే సంస్కృత విశ్వవిద్యాలయం
వల్ల ఆంధ్రప్రదేశ్ లో సంస్కృత అకాడమీ అభివృద్ధి చెందుతుందని, పుస్తకాలు మొత్తం ప్రింటింగ్ చేసే అవకాశం కూడా వస్తుందన్నారు.
సంస్కృత సప్తాహం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25న శ్రీకాకుళం, విజయనగరంలలో, 26న విశాఖపట్నం, కొవ్వూరులలో, 27న తణుకు, గుంటూరులలో నిర్వహించామన్నారు.
28న జిల్లెళ్ళమూడి, నెల్లూరులలో, 29న తిరుపతి, కడపలలో, 30న అనంతపురం, కర్నూలు లలో, 31న గుడివాడ, విజయవాడ లలో జరుపుతున్నామని చెప్పారు. సంస్కృత సప్తాహం ముగింపు కార్యక్రమం విజయవాడలో ఘంటసాల వెంకటేశ్వర రావు ప్రభుత్వ సంగీత కళాశాలలో జరుగుతుందన్నారు. సప్తాహం కార్యక్రమం సందర్బంగా విద్యార్థులకు భారతం, భాగవతంతో పాటు ఇతర క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సంస్కృతంలో విశేష కృషి చేసిన వారికి సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆగష్టు 29న తెలుగు భాషను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన గిడుగు రామూర్తి జయంతికి తెలుగు భాషా, తెలుగు సంస్కృతికి విశేషంగా కృషి చేసిన తెలుగు భాషా ప్రముఖులకి అవార్డు బహుకరణ ఉంటుందన్నారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పి.వరప్రసాద మూర్తి సభాధ్యక్షత వహించి మాట్లాడుతూ శ్రావణ పౌర్ణిమ రోజున సంస్కృత దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. శారద నికేతనానికి మహాత్మా గాంధీ విచ్చేశారని, ఇది గొప్ప ముదావహం అన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న పూర్వ మంత్రి వర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ సంస్కృతాన్ని పరిరక్షించుకోవాలన్నారు. సంస్కృతం గొప్ప భాష అన్నారు. ఉపాధి కల్పించడంలో సఫలీకృతం చేయడం ద్వారా యువత భాషను నేర్చుకోవడానికి ముందుకు వస్తారని చెప్పారు. సంస్కృత భాష మధురమైన భాష అని పేర్కొన్నారు. సంస్కృత భాషలో ఉన్న జ్ఞానాన్ని అందించి, ఆకర్షితులను చేయాలని సూచించారు. భాషను బ్రతికించుటకు అన్ని అవకాశాలు వెతకాలని అన్నారు. సంస్కృత సప్తాహం అనే మంచి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయుటకు పూనుకోవడం ముదావహం అన్నారు. కొత్త ఆలోచనలతో సంస్కృత భాషను వ్యాప్తి చేయాలని కోరారు.
ఉత్సవ ప్రముఖులు డా. దీవి నరసింహ దీక్షిత్ మాట్లాడుతూ సంస్కృత భాష సరళమైన భాష అని చెప్పుటకు ఏర్పాటు చేసిన మంచి కార్యక్రమం అన్నారు. ఇంటి ఇల్లాలు సంస్కృతం మాట్లాడితే ఇల్లు అంతా సంస్కృతం మాట్లాడుతుందన్నారు. సంస్కృత సప్తాహం గొప్ప వినయ యాత్ర అన్నారు. సంస్కృత భాషను వ్యాప్తి చేయుటకు ప్రతి ఒక్కరి కృషి అవసరం అన్నారు.
సంస్కృత విద్యార్థి పి.శ్రీవాణి మాట్లాడుతూ సంస్కృత భాష వైశిష్ట్యాన్ని వివరించారు.
సంస్కృత పండితులు డా. పి.టి.జి రంగాచార్య మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి, సంస్కారానికి సంస్కృత భాష గొప్ప వారధి అన్నారు. భారతీయులు అందరూ సమష్టిగా భాషను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
సంస్కృత పడితులు – డా. శ్రిష్టి లక్ష్మీ కుమార శర్మ, డా. ఆకెళ్ళ మల్లు సోమయాజులు, సుఖవాసి మల్లిఖార్జునరాయ శాస్త్రి, కూనిశెట్టి స్వరాజ్య లక్ష్మి లను ఘనంగా సత్కరించారు.




