
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) దేశంలోనే అత్యంత శక్తిమంతమైన యువజన సంస్థల్లో ఒకటని, ప్రస్తుతం ‘జెన్-జీ’గా పిలుస్తున్న యువతలో పెద్ద సంఖ్యలో స్వయంసేవకులు ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ పేర్కొన్నారు. యువతను కేవలం నిరసనలు, ఆందోళనలతోనే నిర్వచించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
నేపాల్ రాజధాని ఖాట్మండులో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రామ్ మాధవ్.. దేశ యువతలో ఆర్‌ఎస్‌ఎస్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కు ఉన్న విస్తృత స్థాయి అనుబంధాన్ని ప్రస్తావించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టేవారినే ‘జెన్-జీ’ యువతగా చూడటం సరికాదని రామ్ మాధవ్ అన్నారు. నేటి తరం యువతలో ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీల్లోనూ పెద్ద సంఖ్యలో యువకులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా యువమోర్చా ద్వారా యువత నుంచి గణనీయమైన మద్దతు లభిస్తోందని తెలిపారు.
యువతను ‘జెన్-జీ’, ‘మిలీనియల్స్’ అంటూ విభజించడమెందుకు?
యువతను వేర్వేరు తరాల పేర్లతో విభజించే ధోరణిపైనా రామ్ మాధవ్ ప్రశ్నలు లేవనెత్తారు.“జెన్-జీ, మిలీనియల్స్, జెన్ ఆల్ఫా వంటి కొత్త పదజాలంతో మన యువతను ఎంతగా విభజించాలనుకుంటున్నారు?” అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి లేబుల్స్ ఆధారంగా యువతను అర్థం చేసుకునే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
యువతలో దేశం, సమాజం పట్ల బాధ్యతతో పనిచేసే విస్తృత వర్గం ఉందని, వారిని కేవలం ఆందోళనలు, నిరసనల ఆధారంగా నిర్వచించడం సరికాదన్నదే ఆయన వ్యాఖ్యల సారాంశంగా కనిపిస్తోంది.
ఢిల్లీ నిరసనలపై రామ్ మాధవ్ వ్యాఖ్యలు
గత నెల ఢిల్లీలో జరిగిన యువత నిరసనలను ప్రస్తావించిన ఆయన.. ప్రభుత్వం వారి సమస్యలను త్వరగా పరిష్కరించిందని, తద్వారా నిరసనల ప్రధాన లక్ష్యం నెరవేరిందని అన్నారు. ఆ నిరసనల్లో ‘జెన్-జీ’కి చెందని ఇతర వర్గాలు కూడా పాల్గొన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే భారత్‌లో జరిగిన పరిణామాలను నేపాల్‌లో చోటుచేసుకున్న యువత ఉద్యమాలతో పోల్చడానికి రామ్ మాధవ్ నిరాకరించారు. నేపాల్‌లోని పరిణామాలు ఆ దేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారమని, ఇతర దేశాల నుంచి వాటిపై వ్యాఖ్యానించడం సముచితం కాదని స్పష్టం చేశారు.





