
సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. హిందూ దేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గతంలో పలు ప్రాంతాల్లో ఆలయాలు, విగ్రహాలపై దాడులు జరిగిన ఘటనలు ఆందోళన కలిగించాయని భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. సనాతన ధర్మానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, కాకినాడలో చోటుచేసుకున్న సౌజన్యకు సంబంధించిన ‘లవ్ జిహాద్’ ఆరోపణల ఘటనపై కూడా భానుప్రకాశ్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు.
బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన పోలీసు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై ఏపీ డీజీపీ ప్రత్యేక దృష్టి సారించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని భానుప్రకాశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.




