
(శ్రావణ పూర్ణిమ 28-08-2026 రక్షాబంధన్ పండుగ)
పవిత్ర భారతభూమిలో ప్రతీ అడుగూ పండుగే. ప్రతీ సందర్భమూ వేడుకే. ప్రతీ యేటా శ్రావణ పూర్ణిమ నాడు సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధనం లేక రాఖీ పండుగ జరుపుకోవడం మనకు ఆనవాయితీ. రక్షాబంధనం అంటే తమను రక్షించేవారి చేతికి పవిత్రమైన కాషాయ రంగు సూత్రాన్ని కట్టడం, వారి నుంచి ప్రేమపూర్వక రక్షణ లభిస్తుందని విశ్వసించడమే. ఆ అపురూపమైన భావననే రక్షాబంధనం అనే పర్వదినంగా జరుపుకుంటాం. సనాతన సంప్రదాయంలో అత్యంత ప్రాచీనమైన పర్వదినాల్లో రక్షాబంధనం ఒకటి. వేదకాలం నాటికే రక్షాబంధన పర్వదినం జరుపుకునే ఆనవాయితీ ఉంది.
ఈ పండుగ రోజు సాధారణంగా అక్కలు లేక చెల్లెళ్ళు తమ తమ్ముళ్ళు లేక అన్నయ్యల చేతికి రాఖీ కడతారు. దానికి ప్రతిగా అన్నదమ్ములు తమ సోదరీమణులకు ప్రేమపూర్వకంగా కానుకలు అందిస్తారు. నిజానికి, ఒకరి రక్షణను, భద్రతనూ ఆశిస్తూ మంచిమనసుతో ఎవరైనా ఎవరికైనా రక్షాబంధనం కట్టవచ్చు. భారతీయ పురాణాల ప్రకారం దేవ దానవుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంద్రుడి విజయం కోరుతూ ఆయన భార్య శచీదేవి పూజ చేసి, భర్త చేతికి రక్షాబంధనం కడుతుంది. అప్పటినుంచీ రక్షాబంధన సంప్రదాయం ప్రారంభమైంది. అలాగే భారతంలో ఒక సందర్భంలో శ్రీకృష్ణుడి చేతికి గాయమైతే ద్రౌపది తన చీరెకొంగు చించి కట్టు కడుతుంది. దాన్నే రక్షాబంధనంగా భావించిన కృష్ణుడు, దుశ్శాసనుడు ద్రౌపదిని అవమానించే వేళ ఆమెను రక్షిస్తాడు. ఇలా… ఆత్మీయుల అనుబంధానికి గుర్తుగా రక్షాబంధనం నిలిచింది. కాలక్రమంలో ఈ పండుగ అన్నాదమ్ములకు అక్కాచెల్లెళ్ళు రాఖీలు కట్టడం అనే విధంగా స్థిరపడింది. ఏది ఏమైనా, ఆత్మీయ బంధువులు అభిమానంతో అన్నివేళలా అండదండలుగా నిలవడమే ఈ రక్షాబంధన పర్వదినపు స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జరుపుకునే ఆరు ప్రధానమైన పండుగల్లో రక్షాబంధనం ఒకటి. భారతదేశ శ్రేయస్సును కోరుకునే ఆర్ఎస్ఎస్ సంస్థ… ఈ రాఖీ పండుగను విలక్షణంగా నిర్వహిస్తుంది. దేశ ప్రజల మధ్యలో సమైక్య భావాన్ని, ఆత్మీయతా బంధాన్నీ వ్యాపింపజేయడమే ఉద్దేశంగా రాఖీ పండుగ జరుపుతుంది. స్వయంసేవకులు శ్రావణ పూర్ణిమ రోజున తమ శాఖకు వెడతారు. కాషాయ ధ్వజానికి పూజ చేసి దానికి సంప్రదాయబద్ధమైన కాషాయరంగు రక్షాబంధనం కడతారు. తర్వాత స్వయంసేవకులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటారు. ‘‘నేను నీకు రక్ష…. నీవు నాకు రక్ష… మనందరం దేశానికీ ధర్మానికీ రక్ష’’ అంటూ ప్రతిజ్ఞ చేస్తారు.
హిందూ ధర్మంలో ప్రతీ పండుగా ఏదో ఒక సందర్భానికి ప్రతీకగా నిలుస్తుంది, దాని ఆధారంగానే వేడుకలు జరుగుతుంటాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భావనలో… సమాజంలోని అన్ని దుష్ట శక్తులు, అసాంఘిక శక్తుల నుంచి సామాన్య ప్రజలను రక్షించాలి అనే సదుద్దేశానికి స్వయంసేవకులు కట్టుబడి ఉండే నియమానికే రాఖీ పండుగ ఒక ప్రతీక. ఈ సమాజపు సాంస్కృతిక, నైతిక విలువల పరిరక్షణకు స్వయంసేవకులు నిబద్ధతతో కృషి చేస్తారు. రక్షాబంధన పర్వదిన వేళ భారతమాతకు వారు సమర్పించే కానుక అదే.




