ArticlesNews

కేరళలో సనాతన ధర్మం అంతరించిపోకుండా కాపాడిన సాధు సంస్కర్త

2views

( ఆగస్టు 28 – శ్రీ నారాయణగురు జయంతి )

దేశంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావశీలమైన సంఘసంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు శ్రీ నారాయణగురు. కేరళలోని చెన్పళంతి గ్రామంలో 1856లో స్థానిక కాలమానం ప్రకారం చింగం మాసం చతయం నక్షత్రంలో నారాయణగురు జన్మించారు. ఒక సాధువు, అద్వైతవేదాంతి, పండితుడు, కవి, రచయిత, దార్శనికుడు మాత్రమే కాదు… శ్రీ నారాయణగురు భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన ప్రారంభకుల్లో ఒకరు. ఆయన సంస్కరణ ఉద్యమం చాలా ప్రత్యేకమైనది. హిందూ సమాజంలో అణగారిన వర్గాలకు ఆధ్యాత్మిక స్వేచ్ఛ, సామాజిక సమానత్వ విలువలను అందించడం ద్వారా వారిలో విశ్వాసాన్నీ, ఆత్మగౌరవాన్నీ జాగృతం చేసిన మహనీయుడు ఆయన.

 

ప్రధానంగా ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించే సాధువే అయినప్పటికీ నారాయణగురు కులవ్యవస్థ, మూఢనమ్మకాలు, జంతుబలులు వంటి ఐహిక విషయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసారు. విద్య, నైపుణ్యాభివృద్ధి గురించి ప్రచారం చేసారు. ఆయన దేవాలయాలను మాత్రమే కాదు, గ్రంథాలయాలనూ స్థాపించారు. సంస్కృత భాషలో గొప్ప పండితుడైన నారాయణగురు యాజ్ఞవల్క్యుడి వంటి వేదఋషుల భావనలను ప్రచారం చేసారు. అంతేకాదు, సర్వమానవ సౌభ్రాతృత్వం, భూతదయ, ప్రేమ వంటి సందేశాలను సామాన్యుడి భాషలో అందించారు. ఆధునిక ప్రగతిశీల కేరళ సమాజ నిర్మాణానికి ఆయన ఉద్యమమే పటిష్టమైన పునాది వేసింది. నారాయణగురు ప్రేరణతోనే తమిళనాడు, కర్ణాటక, శ్రీలంక ప్రాంతాల్లోనూ సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి.

 

నారాయణ ఒక సాధారణ ఉపాధ్యాయుడి కుమారుడు. ఆయన మళయాళం, తమిళం, సంస్కృతం అభ్యసించారు. తల్లిదండ్రుల మరణానంతరం ఆధ్యాత్మిక జిజ్ఞాసతో ఇంటిని వదిలిపెట్టేసారు. ఆ సమయంలోనే సమాజంలోని అణగారిన వర్గాల దురవస్థలను చూసి చలించిపోయారు. ఆనాటి కేరళలో అణగారిన వర్గాల ప్రజలు కులవివక్షను తప్పించుకోడానికి క్రైస్తవం, ఇస్లాం మతాలలోకి మారుతుండేవారు. ఆ పరిస్థితిని స్వామి వివేకానంద కూడా గమనించి, కులవివక్ష పట్ల తీవ్రంగా స్పందించారు.

 

దిగువ కులాల వారిలో ఆత్మగౌరవాన్ని పాదుగొల్పడానికి శ్రీ నారాయణగురు నైతిక, ఆధ్యాత్మిక విలువలను ఆధారం చేసుకున్నారు. అప్పట్లో తిరువాన్కూరులో నిమ్నవర్ణాల హిందువులను గుడులలోకి రానిచ్చేవారు కాదు. దాంతో నారాయణగురు 1887లో తిరువనంతపురం దగ్గర అరువిప్పురంలో శివాలయాన్ని నిర్మించారు. అదే సమయంలో పల్పు అనే విద్యాధికుడు ఎళవ కులాన్ని ఉద్ధరించడానికి రాజకీయ ఉద్యమం చేపట్టారు. హిందువుల్లో సంస్కరణ తెచ్చేందుకు ఆయన నారాయణగురువే సరైన వ్యక్తి అని భావించారు.

 

నారాయణగురు రంగప్రవేశం తర్వాత ఎళవ కులస్తులు క్రైస్తవంలోకి మతం మారడం దాదాపు నిలిచిపోయింది. ఎళవ కులస్తులకు అగ్రవర్ణస్తులపై చాలాకాలంగా కోపం ఉన్నప్పటికీ, నారాయణగురు వారిని ఆధ్యాత్మిక, నైతిక బలాన్ని పెంచుకోవాలంటూ ప్రోత్సహించారు. విద్య, నైపుణ్యాలూ అలవరచుకోవాలని హితవు పలికారు. కమ్యూనిస్టుల కంటె చాలా ముందే ‘శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం’ సంస్థ తిరువాన్కూరులో మొట్టమొదటి కార్మిక సంస్థను స్థాపించింది. ‘మానవత్వానికి కులం ఒకటే, మతం ఒకటే, దైవం ఒక్కరే’ అన్న నారాయణగురు పిలుపు అందరినీ ఆకట్టుకుంది. అందుకే శ్రీ నారాయణగురు ఇవాళ్టికీ కేరళలోనే కాదు, యావద్భారతానికే ఆదర్శప్రాయుడు.