
రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. దేశీయ సంస్థలు ఈ సాంకేతికతలను ఉపయోగించి భారత్‌లోనే క్షిపణులను తయారు చేసుకునేందుకు మార్గం సుగమమైంది.
రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన సంప్రదాయ క్షిపణి వ్యవస్థల టెక్నాలజీని అర్హత కలిగిన భారతీయ సంస్థలకు బదిలీ చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన అర్హతలు, ధ్రువీకరణలు, నియంత్రణ సంస్థల నిబంధనలను కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన క్షిపణి సాంకేతికతలు కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితం కాకుండా, అర్హత ఉన్న దేశీయ పరిశ్రమలు కూడా వాటిని ఉత్పత్తిలోకి తీసుకురావడానికి అవకాశం లభిస్తుంది.
ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ఊతం
రక్షణ తయారీలో దేశీయ సామర్థ్యాలను పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో డీఆర్‌డీఓ టెక్నాలజీని భారతీయ పరిశ్రమలకు బదిలీ చేయడం కీలక అడుగుగా రక్షణ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. దేశ రక్షణ అవసరాలను దేశీయంగా తీర్చుకోవడంతో పాటు, భారతీయ సంస్థలకు అత్యాధుని రక్షణ సాంకేతికతలపై పనిచేసే అవకాశం కల్పించడం ద్వారా రక్షణ తయారీ రంగం మరింత విస్తరించనుంది. దీర్ఘకాలంలో దేశీయ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
హైపర్‌సోనిక్ ఆయుధాలపైనా దృష్టి
ఇప్పటికే భారత్ స్వదేశీ హైపర్‌సోనిక్ ఆయుధాల అభివృద్ధిలో ముందడుగు వేస్తోంది. హైపర్‌సోనిక్ గ్లైడ్, క్రూయిజ్ క్షిపణి సాంకేతికతలపై డీఆర్‌డీఓ పరిశోధనలు కొనసాగిస్తోంది. అత్యంత వేగంతో ప్రయాణించే ఈ తరహా ఆయుధ వ్యవస్థలు భవిష్యత్తు రక్షణ అవసరాల్లో కీలకంగా మారనున్నాయి. ఇలాంటి అధునాతన సాంకేతికతలపై దేశీయంగా పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా రక్షణ రంగంలో భారత్ వ్యూహాత్మకంగా మరింత బలోపేతం కావాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సంప్రదాయ క్షిపణి వ్యవస్థల టెక్నాలజీని దేశీయ పరిశ్రమలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధి నుంచి భారీ స్థాయి ఉత్పత్తి వరకు దేశీయ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నాల్లో ఇది మరో ముందడుగుగా నిలవనుంది.




