News

‘లవ్‌ జిహాద్‌’ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలి

7views

కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్‌ సాదిక్‌ ఖాన్‌పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అతడికి సహకరించిన వారిని కూడా గుర్తించి విచారించాలని కోరారు.

నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో సాదిక్‌ ఖాన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో.. ఈ కేసును కేవలం ప్రేమ వ్యవహారం లేదా ఆర్థిక వివాదంగా చూడకూడదని మాధవ్‌ అన్నారు. బ్లాక్‌మెయిల్‌, బెదిరింపులు, ఆర్థిక దోపిడీ, బలవంతపు మత మార్పిడి వంటి ఆరోపణలపై అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.

నేరం ఏదైనా నేరంగానే చూడాలి
ప్రేమ పేరుతో మోసం, బ్లాక్‌మెయిల్‌, ఆస్తుల కోసం బెదిరింపులు, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలు వెలుగులోకి వస్తే వాటిని తీవ్రంగా పరిగణించాలని మాధవ్‌ అన్నారు. బాధిత కుటుంబం రాసిన లేఖ, పోలీసులకు అందిన ఫిర్యాదులు, ఇతర ఆధారాల ఆధారంగా ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా పరిశీలించాలని కోరారు. నేరస్థుల మతం, కులం, రాజకీయ పలుకుబడితో సంబంధం లేకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

మహిళలు, యువతులు వేధింపులకు గురవుతున్న ఘటనలపై పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర డీజీపీ, హోంశాఖ మంత్రి ప్రజలకు వివరించాలని పీవీఎన్‌ మాధవ్‌ డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు ఎన్ని, ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి, ఎన్ని కేసుల్లో దర్యాప్తు పూర్తయింది, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని కోరారు.

బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినప్పుడు వారి ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలని, కౌన్సెలింగ్‌ పేరుతో కేసులను నీరుగార్చకూడదని అన్నారు. బాధితుల గోప్యత, గౌరవాన్ని కాపాడుతూ తక్షణ రక్షణ కల్పించాలని సూచించారు.

మహిళలు, బాలికల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని మాధవ్‌ స్పష్టం చేశారు. అక్రమ వసూళ్లు, బ్లాక్‌మెయిల్‌, బలవంతపు మత మార్పిడి, హింస, ఉగ్రవాద సంబంధాలపై అనుమానాలు ఉన్న ప్రతి అంశాన్ని పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని కోరారు.

కాకినాడ, పెద్దాపురం ప్రాంతాల్లో గతంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న వ్యక్తుల అరెస్టుల నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అయితే ఎవరిపైనైనా ఉగ్రవాద సంబంధాల ఆరోపణలను నిర్ధారిత ఆధారాల ఆధారంగానే దర్యాప్తు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

‘లవ్‌ జిహాద్‌’ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలి
‘లవ్‌ జిహాద్‌’ పేరుతో ఆరోపణలు ఎదురవుతున్న ఘటనలపై ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేయాలని మాధవ్‌ కోరారు. పరిచయం పెంచుకోవడం, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, బ్లాక్‌మెయిల్‌ చేయడం, ఆర్థికంగా దోచుకోవడం, బెదిరింపులకు పాల్పడటం వంటి నేరపూరిత చర్యలు ఎక్కడ జరిగినా కఠినంగా అడ్డుకోవాలని అన్నారు.

జిమ్‌లు, స్పోర్ట్స్‌ అకాడమీలు, సెలూన్లు, కార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్‌ వంటి ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సైబర్‌ బ్లాక్‌మెయిల్‌, వ్యక్తిగత ఫొటోల దుర్వినియోగం, ఆన్‌లైన్‌ వేధింపులపై యువతకు ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు.

నూకరాజు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం
ఏఈ నూకరాజు కుటుంబం ఎదుర్కొన్న విషాదం అత్యంత బాధాకరమని పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. ఈ ఘటనకు దారితీసిన ప్రతి కారణాన్ని వెలికితీసి, బాధ్యులందరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పరారీలో ఉన్న సాదిక్‌ ఖాన్‌ను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయని, ఈ నేపథ్యంలో తదుపరి దర్యాప్తు కీలకమని తెలిపారు.

“బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా, కేసులోని ప్రతి కోణం వెలుగులోకి వచ్చేలా దర్యాప్తు జరగాలి. నేరస్థులకు రాజకీయ, సామాజిక, ఆర్థిక పలుకుబడి ఏదైనా చట్టం ముందు సమానమే. మహిళలు, బాలికల భద్రతకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా పోలీసు మెట్లు ఎక్కి ప్రజల తరఫున పోరాడుతుంది. ఉగ్రవాదం, నేరాలు, బ్లాక్‌మెయిల్‌, బలవంతపు మత మార్పిడి వంటి అంశాలపై ఉక్కుపాదం మోపాలి” అని పీవీఎన్‌ మాధవ్‌ రాష్ట్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.