
బెంగళూరు : ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వారు రెండు రోజుల పాటు పెర్మా కల్చర్ సదస్సును నిర్వహించారు. ఆహారంలో రసాయన అవశేషాలు పెరిగిపోవడం, క్షీణించిపోతున్న నేల ఆరోగ్యం, నీటి కొరత, పెరుగుతున్న వ్యవసాయ ఉత్పాదక వ్యయాల పెరిగిపోవడం లాంటి ప్రధాన సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది సదస్సు. అలాగే ఈ సదస్సుకి వచ్చిన అతిథులు వీటిపై లోతైన చర్చ కూడా చేశారు.
రామనగరలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన ఈ సదస్సు, సుస్థిర మరియు పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతుల ఆవశ్యకతపై చర్చించింది. ఈ సదస్సుకి రైతులు, వ్యవసాయ నిపుణులు, పెర్మాకల్చర్ చేస్తున్న వారు, పర్యావరణవేత్తలతో పాటు వ్యవసాయ రంగ నిపుణులు ఈ సదస్సుకి విచ్చేశారు. ఆధునిక వ్యవసాయం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లపై అవగాహన కల్పించడంతో పాటు సుస్థిర వ్యవసాయ ప్రత్యామ్నాయాలను అన్వేషించడంపై దృష్టిసారించారు.
ప్రకృతిహితమైన వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయాన్ని ఒకే బాటపైకి తీసుకుకరావడం అనే థీమ్ తో ఈ సదస్సు జరిగింది. సేంద్రీయ వ్యవసాయంలో, రసాయన రహిత వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులను తీసుకెళ్లే విధానంపై చర్చించారు.
రసాయన ఆధారిత వ్యవసాయం పెరిగిపోతుండటం, దీంతో వ్యవసాయ నేలలపై పడుతున్న ప్రభావం, ఈ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై ఎలా పడుతుందో కూడా సదస్సు క్షుణ్ణంగా చర్చించింది. వీటన్నింటిని తగ్గించే మార్గాలు ఏవైనా వున్నాయా? అని కూడా ప్రత్యామ్నాయలను అన్వేషించింది.
రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో నీటి కొరత ఒకటిగా సదస్సు గుర్తించింది. భూగర్భ జలాలపై పెరుగుతున్న ఒత్తిడి, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ, నేల తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని మెరుగుపరిచే వ్యవసాయ పద్ధతుల ఆవశ్యకతను నిపుణులు నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ రవి శంకర్ మాట్లాడుతూ ప్రకృతిహితమైన వ్యవసాయం, పునరుత్పాదక వ్యవసాయం వైపు సాగే పరివర్తనను కేవలం వ్యవసాయ పద్ధతుల్లోని మార్పుగా మాత్రమే చూడొద్దని, రైతుల చైతన్యంలో వస్తున్న విస్తృతమైన మార్పుగా చూడాలన్నారు. అయితే.. దీనికి ప్రకృతి పట్ల అపారమైన ప్రేమ, గౌరవం అన్నవి ప్రాథమిక లక్షణాలుగా వుండాలన్నారు. అప్పుడు మాత్రమే సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లుతారన్నారు.
అలాగే సహజవనరులను దెబ్బతీసేలా, అత్యాశతో కూడిన విధానాల ద్వారా వ్యవసాయ అభివృద్ధి అనేది జరగొద్దని హెచ్చరించారు. నేల ఆరోగ్యం, నీటి లభ్యత, ఆహార నాణ్యత, మానవ శ్రేయస్సు అనేవి పరస్పర పూరకాలని, ఒకదానిపై ఒకటి ఆధారపడి, ముడిపడే వుంటాయని స్పష్టం చేశారు. వ్యవసాయ విధానంలో నిర్ణయాలు తీసుకునే క్రమంలో వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రకృతికంటూ ఓ పద్ధతి వుందని, దానికి కూడా దాని శైలి అంటూ ఒకటి వుందని, దానిపై ఆధిపత్యం చెలాయించం మానుకోవాలని, దానికి బదులుగా ప్రకృతిని గౌరవించాలని, పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులను మరింత అభివృద్ధి చేసుకుంటే మంచిదన్నారు.
వ్యవసాయాన్ని కేవలం వ్యవసాయంగా మాత్రమే చూడొద్దని, నీటి వనరులు, రైతులు, వినియోగదారులు, మార్కెట్, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలు మరియు మానవ ఆరోగ్యం వంటి వాటితో కూడిన చాలా పెద్ద పర్యావరణ వ్యవస్థకు అనుసంధానమయ్యే పెద్ద వ్యవస్థగా అభివర్ణించారు. వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి వివిధ భాగస్వాములను ఒకచోట చేర్చాల్సిన ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ప్రజలను మరియు సంస్థలను అనుసంధానించి, రైతులు, వినియోగదారులు, ఆర్థిక సంస్థలు మరియు ఉత్పత్తిదారులు కలిసి పనిచేయగల వేదికలను సృష్టించడానికి ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు.
బ్యాంకులను రైతులతో, ఉత్పత్తిదారులను వినియోగదారులతో అనుసంధానించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఇటువంటి అనుసంధానాలు, ప్రతి భాగస్వామి ఇతరులను అర్థం చేసుకుని, మద్దతు ఇచ్చే మరింత సుస్థిరమైన వ్యవస్థను రూపొందించడంలో సహాయపడగలవని ఆయన అన్నారు. “మనం అందరినీ అనుసంధానించినప్పుడు, సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది,” అని ఆయన అన్నారు.
భోజనానికి ముందు ప్రార్థన చేసే అభ్యాసం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా రవిశంకర్ మాట్లాడారు. ఆహారాన్ని పండించే రైతుతో మొదలుకొని రవాణా, పంపిణీ మరియు తయారీలో పాలుపంచుకునే వారి వరకు, ఒక సుదీర్ఘ గొలుసులోని వ్యక్తుల కృషికి ప్రతి భోజనమూ ప్రతీక అని ఈ అభ్యాసం గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. ప్రజల ముందుకు ఆహారాన్ని తీసుకురావడంలో రైతులు, ఇతరులు చేస్తున్న కృషిని సమాజం గుర్తించాలని సూచించారు. వినియోగదారులలో అవగాహన, బాధ్యత మరింత పెరగాలని, దీని ద్వారా సుస్థిరమైన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే ఛాన్స్ వుందన్నారు.




