News

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం సరికాదు

3views

తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో టీటీడీ దృష్టికి వచ్చింది. దీనిపై టీటీడీ స్పందిస్తూ.. భక్తులు నిర్ధారణ లేని వీడియోలను నమ్మవద్దని, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

టీటీడీ ప్రతిరోజూ శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అత్యంత పవిత్రత, పరిశుభ్రతా ప్రమాణాలను పాటిస్తూ భారీ స్థాయిలో తయారు చేసి భక్తులకు అందిస్తోంది. ప్రసాదాల తయారీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

లడ్డూ తయారీకి వినియోగించే ముడి పదార్థాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంగ్రిడియెంట్ సార్టింగ్ మిషన్ ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించింది. ముడి పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలోనూ కఠినమైన ప్రమాణాలను అమలు చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ విధానాల కారణంగా లడ్డూ తయారీలో ఇతర పదార్థాలు కలిసే అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులకు అందించే ప్రతి ప్రసాదం నాణ్యతతో, పరిశుభ్రంగా ఉండేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది.

అయితే టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో కొందరు నిర్ధారణ లేని వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ టీటీడీ ఆందోళన వ్యక్తం చేసింది. స్వామివారి పవిత్ర ప్రసాదంపై భక్తుల్లో అపోహలు కలిగించేలా వ్యవహరించడం సరికాదని పేర్కొంది.

భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదానికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద విషయం కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించింది. సంబంధిత వీడియోలు లేదా సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండాలని కోరింది.

శ్రీవారి ప్రసాదాల పవిత్రత, నాణ్యత, పరిశుభ్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.