
3views
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మనుస్మృతిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీటిపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. హిందూ సమాజాన్ని, దాని సంప్రదాయాలను కావాలనే లక్ష్యంగా చేసుకున్న రాజకీయ ప్రకటన అని అభివర్ణించింది. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ తీవ్రంగా మండిపడ్డారు.
అంతేకాకుండా రాహుల్ గాంధీకి సూటి ప్రశ్నను సంధించారు. ఖురాన్, బైబిల్ విషయంలోనూ ఇదే ధైర్యంతో వుంటారా? అంటూ సవాల్ విసిరారు. ‘మనుస్మృతి’లోని మహిళలకు సంబంధించిన వ్యాఖ్యలను బహిరంగంగా ఉదహరించి విమర్శించగలిగిన రాహుల్ గాంధీ, ఖురాన్, బైబిల్ మరియు ఇతర అబ్రహమిక్ మత గ్రంథాలలోని మహిళలకు సంబంధించిన వ్యాఖ్యలను కూడా అదే విధంగా బహిరంగంగా ఉదహరించే ధైర్యాన్ని ప్రదర్శిస్తారా? అని బన్సల్ నిలదీశారు.
భారత రాజకీయాల్లో హిందూ సంప్రదాయాలకు సంబంధించిన గ్రంథాలు తరుచూ విమర్శలకు గురవుతుంటాయని, అదే ఇతర మత గ్రంథాలకు సంబంధించిన విషయంలో మాత్రం నేతలు వెనకంజ వేస్తారని మండిపడ్డారు.”‘యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతాః’ (స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు) అనేది కూడా మనుస్మృతిలోని ఒక శ్లోకమేనని మీకు తెలుసా?” రాహుల్ గాంధీ ముందుగా పూర్తి ‘మనుస్మృతి’ని చదివి, దానిపై ఉన్న వివిధ వ్యాఖ్యానాలు మరియు ఋషి సంప్రదాయాన్ని అర్థం చేసుకున్న తర్వాతే హిందూ సమాజం గురించి ఏదైనా నిర్ధారణకు రావాలని ఆయన అన్నారు.
‘మనుస్మృతి’ని కేవలం మహిళల పట్ల ప్రతికూల దృక్పథాన్ని కలిగి ఉన్న గ్రంథంగా మాత్రమే చూపించడం అనేది, భారతీయ సంప్రదాయంలోని సంక్లిష్టతను మరియు వైవిధ్యాన్ని ఒకే ఒక్క నిర్ధారణకు పరిమితం చేయడమేనని అన్నారు. అయితే.. నేతలు అప్పుడప్పుడు వక్రీకరిస్తూ అర్థాలు వివరిస్తారని, అవి రాజకీయ చర్చలను మాత్రం ప్రభావితం చేస్తాయి కానీ.. సంపూర్ణ చరిత్రక సత్యాన్ని మాత్ం ఆవిష్కరించవని బన్సల్ అన్నారు.




