News

ఇంద్రకీలాద్రిపై రెండో ఘాట్‌రోడ్డు – రూ.13 కోట్లతో అంచనాలు

4views

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో ఘాట్‌రోడ్డు ఏర్పాటుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఇందుకుగానూ దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగం, ఆర్‌అండ్‌బీ శాఖ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌ మెకానిక్స్‌ (ఎన్‌ఐఆర్‌ఎం) సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కొత్త ఘాట్‌రోడ్డు నిర్మాణానికి రూ.13 కోట్లతో బడ్జెట్ అంచనాలను ఆర్‌అండ్‌బీ సిద్ధం చేసి దేవస్థానానికి ఇచ్చింది. త్వరలో డీపీఆర్‌ తయారీ బాధ్యతలను ఆర్‌అండ్‌బీ ద్వారా ఓ సంస్థకు అప్పగించనున్నారు.

ప్రస్తుతం దుర్గాఘాట్‌ ఎదురుగా ఉన్న ఘాట్‌రోడ్డును దశాబ్దాల క్రితం నిర్మించారు. అప్పటితో పోలిస్తే ఆలయానికి వచ్చే భక్తులు, వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఈ మార్గం తీవ్ర రద్దీని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో కొండపైకి వెళ్లే వాహనాలతో ఘాట్‌రోడ్డు పూర్తిగా స్తంభించిపోతోంది. కొండపై గట్టిగా ఓ 150 కార్లు పార్కింగ్‌ చేస్తే వాహనాలు కదిలే పరిస్థితి ఉండడం లేదు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా జాతీయ రహదారిపై నుంచి ఘాట్‌రోడ్డు వరకు ట్రాఫిక్‌ నిలిచిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కుమ్మరిపాలెం నుంచి కొత్త మార్గం: హైదరాబాద్‌ వైపు నుంచి ఎన్‌హెచ్‌-65 మీదుగా వచ్చే మార్గంలో కనకదుర్గ ఫ్లైఓవర్‌ కింద కుమ్మరిపాలెం జంక్షన్‌ దాటిన తర్వాత కొత్త ఘాట్‌రోడ్డు ప్రారంభం కానుంది. కుమ్మరిపాలెంలో ఇంద్రకీలాద్రిని ఆనుకుని ఉండే ప్రైమరీ హెల్త్​ సెంటర్ (పీహెచ్‌సీ) దగ్గర నుంచి ఘాట్​రోడ్డు ఆరంభం కానుంది. కొండపై ప్రస్తుతం ఉన్న ‘ఓం టర్నింగ్‌’ వద్ద కలిసేలా ప్రతిపాదనలు రూపొందించారు. దీంతో ఆలయానికి వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుంది.

టీటీడీ స్థలంలో పార్కింగ్‌, కాటేజీలు: కుమ్మరిపాలెం జంక్షన్‌ సమీపంలోని రెండు ఎకరాల టీటీడీ స్థలాన్ని దుర్గగుడికి బదిలీ చేసేందుకు దాత కుటుంబం అంగీకారం తెలిపింది. ఈ స్థలాన్ని దేవస్థానం పరిధిలోకి తీసుకున్న తర్వాత విస్తృత పార్కింగ్‌ స్థలంతో పాటు భక్తుల కోసం కాటేజీలు నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక్కడ భక్తులు బస చేసి, వాహనాలను పార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచే కొండపైకి అమ్మవారి దర్శనానికి వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు

దసరా తర్వాత ముందడుగు: కొత్త ఘాట్‌రోడ్డుతో పాటు టీటీడీ స్థలంలో చేపట్టే అభివృద్ధి పనులకు దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆమోదం లభించిన వెంటనే నిర్మాణ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎన్‌ఐఆర్‌ఎం నిపుణుల బృందం ఇంద్రకీలాద్రి భౌగోళిక పరిస్థితులను పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తోంది. కొండ పరిస్థితి ఎలా ఉందనేది అంచనా వేసి దాని ప్రకారమే రోడ్డు నిర్మాణాన్ని ఖరారు చేయనున్నారు.

ఈ ప్రతిపాదనపై దుర్గగుడి ఈవో వి.కె. శీనానాయక్‌ను వివరణ కోరగా, రెండో ఘాట్‌రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఆర్‌అండ్‌బీ, ఎన్‌ఐఆర్‌ఎం అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించామని, దసరా ఉత్సవాల అనంతరం ఈ ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని వెల్లడించారు.