News

బీజింగ్‌లో భరతనాట్యంతో మంత్రముగ్ధులను చేసిన చైనా కవలలు

3views

బీజింగ్‌: చైనాకు చెందిన కవల సోదరీమణులు జిన్‌ యాన్షు, జిన్‌ యానై భరతనాట్య ప్రదర్శనతో బీజింగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.బీజింగ్‌ లో జరిగిన కార్యక్రమంలో ఈ 16 ఏళ్ల యువ నృత్య కళాకారిణులు అద్భుతమైన నాట్య ప్రదర్శనతో అలరించారు.

భారతీయ ప్రాచీన శాస్త్రీయ నృత్యమైన భరతనాట్యంపై చిన్న వయసు నుంచే ఆసక్తి పెంచుకున్న జిన్‌ సోదరీమణులు మూడేళ్ల వయసు నుంచే ఈ కళను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం హైస్కూల్‌లో చదువుతున్న వీరు భరతనాట్యంలో విశేష ప్రతిభను కనబరుస్తున్నారు.

ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి లీలా శాంసన్‌ శిష్యురాలైన జిన్‌ షాన్‌షాన్‌ వద్ద జిన్‌ సోదరీమణులు శిక్షణ పొందుతున్నారు. చైనాలో భారత రాయబారి విక్రమ్‌ దొరైస్వామి ఈ సందర్భంగా కవలల ప్రతిభను ప్రశంసించారు. భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని ఇద్దరు యువ చైనీస్‌ కళాకారిణులు పూర్తి ఉత్సాహంతో ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు.

భారత్‌-చైనా సాంస్కృతిక సంబంధాలకు భరతనాట్యం వంటి కళారూపాలు వారధిగా నిలుస్తున్నాయని ఈ ప్రదర్శన మరోసారి చాటిచెప్పింది.