News

ఆర్ఎస్ఎస్‌పై ఆంక్షలు విధించాలన్న USCIRF పిలుపు ఖండించిన విదేశాంగ శాఖ

25views

న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై ఆంక్షలు విధించాలన్న అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (USCIRF) ను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆ సంస్థ పక్షపాతంతో కూడుకున్నదని, దానికి ఎలాంటి విశ్వసనీయత కూడా లేదని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. అది నిర్దిష్ట ఎజెండాతో ప్రచారం చేసే సంస్థ అని, దాని వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

‘యూఎస్‌సీఐఆర్ఎఫ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. ఇలాంటి సంస్థలకు మనం దూరంగా ఉండాలి. వీటికి విశ్వసనీయత ఉండదు, సొంత ఎజెండాలు మాత్రమే ఉంటాయి. ఆ సంస్థ భారత బహుళ వ్యవస్థ వాస్తవికతను స్వీకరిస్తుందని గానీ, దాని విభిన్న వర్గాల సామరస్య సహజీవనాన్ని గుర్తిస్తుందని గానీ మేం ఆశించడం లేదు’ అని జైస్వాల్ పేర్కొన్నారు.

యూఎస్‌సీఐఆర్ఎఫ్ ప్యానెల్ ఛైర్మన్ ఆసిఫ్ మహమూద్ ఇటీవల ఆర్ఎస్ఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సభ్యులపై ఆంక్షలు విధించాలని, అందులోని నాయకులకు ఎలాంటి దౌత్యపరమైన మర్యాదలు, హై-లెవెల్ సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈ నెల 29న అమెరికాలో పర్యటించాల్సి ఉండగా.. దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడని, ఆ సంస్థ ఓ గొడుగు కింద పనిచేస్తోందని విమర్శించారు. దాని అనుబంధ సంస్థలు మైనారిటీలపై దాడి చేస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు.

ఆర్ఎస్ఎస్ (RSS) సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ త్వరలోనే విదేశీ పర్యటన చేపట్టనున్నారు. బ్రిటన్, అమెరికా, కెనడాలో పర్యటిస్తున్నారు.అయితే.. ఈ పర్యటనపై లేనిపోని అపోహలు, అపప్రథలు వేయడానికి భారత వ్యతిరేక శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ‘యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం’ (USCIRF) మరోసారి భారతదేశం పట్ల తన వ్యతిరేక వైఖరిని ప్రదర్శించింది. డాక్టర్ మోహన్ భాగవత్ అమెరికా పర్యటనను ఆ సంస్థ వ్యతిరేకించింది.ఈ సంస్థకు పాకిస్తాన్ మూలాలున్న ఆసిఫ్ మహమూద్ నాయకత్వం వహిస్తున్నాడు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై ఆంక్షలు విధించాలని పిలుపునిస్తూ, దాని నాయకులతో దౌత్య మర్యాదలు పాటించవద్దని లేదా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించవద్దని USCIRF అమెరికాను కోరింది. దీని ద్వారా మరోసారి రెచ్చగొట్టే ప్రక్రియను చేపట్టింది. ప్రస్తుతం ఈ హక్కుల సంస్థకు పాకిస్తానీ-అమెరికన్ వైద్యుడు ఆసిఫ్ మహమూద్ అధ్యక్షత వహిస్తున్నారు.

వివిధ దేశాల్లో వున్న భారతీయ ప్రవాసీయులు,వివిధ సంస్థలు, వివిధ సంఘాల ఆహ్వానం మేరకు డాక్టర్ భాగవత్ ఈ విదేశీ పర్యటన చేస్తున్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ కార్య శతాబ్ది జరుపుకుంటున్న కీలక తరుణంలో ఈ పర్యటన జరుగుతోంది. ఈ పర్యటనలో భాగవత్ ప్రవాస భారతీయులు, వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు.

‘‘విదేశాల్లోని స్థానిక సంఘాలు, సంస్థల ఆహ్వానం మేరకు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ 2026 ఆగస్టు 25 నుండి అమెరికా, కెనడా, యూకే (UK) దేశాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల కాలంలో జరుగుతుండటం విశేషం.” అని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు.