
శబరిమల అయ్యప్ప క్షేత్ర పవిత్రతను కాపాడటంతో పాటు అయ్యప్ప భక్తులకు మెరుగైన యాత్రా సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పనిచేస్తామని వక్తలు, ఆధ్యాత్మిక వేత్తలు తెలిపారు. నవంబరు 15 నుంచి జనవరి 20 వరకు జరిగే అయ్యప్ప సీజన్‌లో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అయ్యప్ప గురుస్వాముల రాష్ట్ర సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన గురుస్వాములు శబరిమల యాత్రలో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించారు. యాత్రలో అనారోగ్యానికి గురైతే సరైన వైద్యసాయం అందక దిక్కుతోచని పరిస్థితులు ఎదురవుతున్నాయని కొందరు గురుస్వాములు గద్గద స్వరంతో వివరించారు.
ధర్మ పరిరక్షణకు సంఘటితం కావాలి
‘‘శివస్వామి, బెజవాడ కనకదుర్గమ్మ, శబరిమల అయ్యప్పస్వామి కరుణాకటాక్షాలతోనే ప్రపంచం నడుస్తోందని త్రికరణశుద్ధిగా విశ్వసిస్తున్నాను’’ అని మాధవ్ అన్నారు. లక్షలాది మందికి అయ్యప్ప మాలధారణ చేయించి, ఇరుముడులు సమర్పింపజేసి స్వాములుగా తీర్చిదిద్దుతున్న గురుస్వాములకు పాదాభివందనాలు తెలిపారు.
గురుస్వాములు 41 రోజుల దీక్షకే పరిమితం కాకుండా జీవితాంతం ధర్మాన్ని, ఆధ్యాత్మికతను ముందుకు తీసుకెళ్లే మార్గదర్శకులుగా నిలుస్తున్నారని కొనియాడారు. హైందవ ధర్మం, దేవాలయ వ్యవస్థ, సనాతన సంప్రదాయాలపై జరుగుతున్న దాడుల పట్ల హిందూ సమాజంలో చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కలియుగంలో సంఘే శక్తి’’ అనే భావనతో హిందూ సమాజం సంఘటితమై ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
శబరిమలపై కుట్రలను అడ్డుకోవాలి
శబరిమల ఆలయ పవిత్రతను కాపాడటం ప్రతి హిందువు బాధ్యత అని మాధవ్ అన్నారు. శబరిమల అంశంలో గతంలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ ఆలయ ఆచారాలను కేవలం ప్రాథమిక హక్కుల కోణంలో కాకుండా ఆయా మత సంప్రదాయాల ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
‘‘హిందూ మతం, దేవాలయాలపై ఒకవైపు అన్యమత శక్తులు, మరోవైపు నాస్తిక శక్తులు దాడి చేస్తున్నాయి. సమాజానికి తెలియకుండా సమాంతర వ్యవస్థలు నడుస్తున్నాయి. శబరిమలలోనూ ఇలాంటి వ్యవస్థలు పనిచేస్తున్నాయి’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు ప్రభుత్వాలు భారతీయ ధర్మాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.
శబరిమల ఆచార వ్యవహారాలపై న్యాయపోరాటం చేస్తున్న న్యాయవాదులకు, ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారికి మద్దతు ఇవ్వాలని కోరారు.
టీటీడీ తరహాలో వ్యవస్థ ఏర్పాటు
శబరిమలలో టీటీడీ తరహాలో సమర్థమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మాధవ్ పేర్కొన్నారు. భక్తులకు తాగునీరు, అన్నదానం, వసతి, వైద్యం, రవాణా వంటి సౌకర్యాలు సమగ్రంగా అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పంబ–నీలక్కల్–సన్నిధానం ప్రాంతాల్లో వసతి, వైద్య కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. సత్రాల నిర్మాణానికి స్థలాలు కేటాయించేందుకు కేరళ ప్రభుత్వం ముందుకు రావాలని, అన్నదానం చేసేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలకు అవకాశాలు కల్పించాలని అన్నారు.
అయ్యప్ప సీజన్‌లో అదనపు రైళ్లు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని, తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని కోరుతామని తెలిపారు. తిరుగు ప్రయాణానికి కూడా తగిన రవాణా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. బస్సు ఛార్జీలు పెంచకుండా నియంత్రించడంతో పాటు అవసరమైతే ప్రత్యేక రాయితీలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు.
ఇప్పటి నుంచే కార్యాచరణ
‘‘నవంబరు 15 నుంచి జనవరి 20 వరకు అయ్యప్ప స్వాములు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఇప్పటి నుంచే ప్రయత్నిస్తాం. వచ్చే ఏడాదిలోపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తాం’’ అని మాధవ్ తెలిపారు.
గురుస్వాముల నుంచి నేరుగా సమస్యలను సేకరించి, వాటిని కేరళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
భక్తుల సమస్యలను హిందూ సమాజ సమస్యగా చూడాలి: భానుప్రకాశ్‌రెడ్డి
బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో పుట్టడం అదృష్టమని, పూర్వీకులు అందించిన సంస్కృతి, సంప్రదాయాలు, దేవాలయాలు మన వారసత్వ సంపద అని అన్నారు. తాను పదిసార్లు శబరిమల వెళ్లానని, గత ఏడాది మూడు రోజుల పాటు స్వామివారి సన్నిధిలో ఉండి భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా గమనించానని చెప్పారు.
శబరిమలలో తాగునీరు, అన్నప్రసాదం తదితర సౌకర్యాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. అయ్యప్ప భక్తుల సమస్యను కేవలం భక్తుల సమస్యగా కాకుండా హిందూ సమాజ సమస్యగా, సనాతన ధర్మానికి సంబంధించిన అంశంగా చూడాలని పిలుపునిచ్చారు.
టీటీడీ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థల్లో ఒకటని, భక్తుల కానుకలతో నడుస్తోందని చెప్పారు. టీటీడీ నిధులను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలన్నదే తన అభిప్రాయమన్నారు. ‘‘వెంకటేశ్వరస్వామి వడ్డీ కాసేవాడే కానీ వడ్డీ వ్యాపారి కాదు’’ అని గతంలో తాను చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
ఎక్కడైనా అన్యాయం జరిగితే ‘‘మనకెందుకులే’’ అనే ధోరణిని విడనాడి ప్రశ్నించే మనస్తత్వం రావాలని భానుప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శబరిమల భక్తుల సమస్యల పరిష్కారం కోసం పీవీఎన్ మాధవ్‌తో కలిసి ముందుండి పనిచేస్తానని హామీ ఇచ్చారు.
స్వామియే శరణం అయ్యప్ప అంటూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నేతలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పైలా ఆదిమోహన రెడ్డి గురు స్వామి మురుగన్ ,సంకా వాసు గురుస్వామి,మధు నంబూద్రి గురుస్వామి,చంటి గురుస్వామి,సోలే వెంకట కోటేశ్వరరావుగురుస్వామి,తోట శివశంకర్ గురుస్వామి,బెవరరాము గురుస్వామి,రాము గురుస్వామి,డుమ్ము గురుస్వామి,కన్నాగురుస్వామి,మేకల హనుమంతరావు గురుస్వామి,సిద్దు స్వామి తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, దుర్గమ్మ ఆలయట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు బుల్లెబ్బాయ తదితరులు పాల్గొన్నారు




