News

తిరుమలలో వైభవంగా పవిత్రోత్సవాలు.. శ్రీవారికి పవిత్రమాలల సమర్పణ

29views

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం యాగశాలలో హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా శ్రీవారి మూలవర్లు, ఉత్సవమూర్తులతో పాటు జయవిజయులు, గరుడాళ్వారు, వరదరాజస్వామివారు, వకుళమాత అమ్మవారు, ఆనందనిలయం, యాగశాల, విష్వక్సేనులవారు, యోగ నరసింహస్వామివారు, భాష్యకార్లు, పోటు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీభూవరాహస్వామివారు, శ్రీబేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.

నాలుగు మాడ వీధుల్లో మలయప్పస్వామి విహారం
పవిత్ర సమర్పణలో భాగంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు యాగశాలలో హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

1962లో పునరుద్ధరణ
తిరుమలలో పవిత్రోత్సవాలు 15, 16వ శతాబ్దాల వరకు నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని టీటీడీ పేర్కొంటోంది. అనంతరం కాలక్రమంలో నిలిచిపోయిన ఈ ఉత్సవాలను 1962లో తిరుమల తిరుపతి దేవస్థానం పునరుద్ధరించింది. ఆలయంలో జరిగే నిత్య, వార, పక్ష, మాస, సంవత్సర ఉత్సవాల్లో తెలిసీ తెలియక జరిగిన లోపాలు, దోషాల నివారణకు పవిత్రోత్సవాలను నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది.